న్యూఢిల్లీ, జూలై 9 : ఈ20 పెట్రోల్‌తో సమస్య వచ్చిన ఒక్క కారు పేరు అయినా చెప్పాలని, ఒక్క బాధితుడినైనా చూపాలని విమర్శకులకు కేంద్ర మంత్రి గడ్కరీ విసిరిన సవాల్‌ను ఒక పారిశ్రామికవేత్త అంగీకరించారు. ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఈ20 పెట్రోల్ బాధితులు ఒక్కరు కాదు ఆరుగురిని ప్రవేశపెడుతామని, ఈ20 ఇంధన సమస్యలను వెల్లడిస్తానని ఆయన వెల్లడించారు. అయితే మీడియా ముందే వారిని గడ్కరీ కలవాలంటూ మంత్రికి షరతు విధించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ20 ఇంధనం కారణంగా తమ వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిపోయిందని, అరుగుదల, తరుగుదల అధికంగా ఉందని, తరచూ మరమ్మతులు వస్తున్నాయని దేశ వ్యాప్తంగా పలువురు వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడతూ ‘ఆల్ ఈజ్ వెల్’ తరహా ప్రకటనలు చేస్తున్నది. ఈ క్రమంలో హక్కుల ఉద్యమకారుడు, పారిశ్రామికవేత్త, టీమ్ భారత్ పేరిట తొలిసారిగా ఈ20 ఇంధనానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన జరిపిన తహ్సీన్ పూనావాలా మంత్రి గడ్కరీ సవాల్‌ను స్వీకరించారు.
ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తొలుత ఈ20 బాధితులను తీసుకుని గడ్కరీ నివాసానికి వెళ్దామని ఆయన అనుకున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు ఆయనకు ఫోన్ చేసి మంత్రి ఇంటికి వెళ్లవద్దని కోరారు. దీంతో తాను ఆ యోచనను విరమించుకున్నానని, మంత్రి ఇంటికి బాధితులను తీసుకువెళితే తనతో పాటు వారిని కూడి నిర్బంధించే, అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అందుకే ఈ కార్యక్రమం మీడియా ఎదుట జరగాలని తాను కోరుతున్నానని, ఈ20 ఇంధన వాడకంతో ఏ వాహనం ఎలా దెబ్బతిందో బాధితులే బహిరంగంగా లైవ్‌లో వివరిస్తారని పూనావాలా చెప్పారు. ఇథనాల్ వ్యాపారంలో తన కుటుంబ సభ్యులకు కేవలం 0.07 శాతం వాటా మాత్రమే ఉందని గడ్కరీ ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ‘మంత్రి గారూ.. సంవత్సరానికి సుమారు రూ. 50 కోట్ల నుంచి 100 కోట్ల ఇథనాల్ వ్యాపారం పెరుగుతూనే ఉంది. మీ ఇద్దరు కుమారులూ ఈ వ్యాపారంలోనే ఉన్నారు. స్వప్రయోజనం వల్ల నిష్పాక్షికంగా వ్యవహరించ లేని స్థితి మీది. ఇది కొడుకును పెంచే పథకం’ అని పేర్కొన్నారు.
దేశంలో ఈ20 ఇంధన వినియోగం, దాని ప్రభావం గురించి తీవ్రంగా చర్చ జరుగుతున్న క్రమంలో.. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో వాహనాల మైలేజ్ తగ్గే అవకాశం ఉందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీ అంగీకరించారు.