E-cigarette Controversy | పార్లమెంట్ సమావేశాల్లో ఈ-సిగరెట్ వ్యవహారం దుమారం రేపింది. లోక్‌సభలో టీఎంసీ ఎంపీ ఈ-సిగరెట్ తాగారని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. తాజాగా ఈ వివాదం కొత్త మలుపు తీసుకున్నది. టీఎంసీపై అనురాగ్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. టీఎంసీ ఎంపీ పార్లమెంటరీ రూల్స్‌ను, చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్‌ను కోరారు. ఈ-సిగరెట్లపై కొనసాగుతున్న వివాదం మధ్య.. గురువారం పార్లమెంట్ ఆవరణలో టీఎంసీ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ ధూమపానం చేస్తూ కనిపించారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
దేశంలో చాలాకాలంగా వాటిపై నిషేధం అమలులో ఉందని.. టీఎంసీ ఎంపీ అనుమతి తీసుకున్నారా? అని స్పీకర్‌ను అడగ్గా.. లేదని ఓం బిర్లా సమాధానం ఇచ్చారు. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ సైతం అనురాగ్ ఠాకూర్‌కు మద్దతు తెలుపుతూ.. ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సౌగతా రాయ్ స్పందిస్తూ సిగరేట్ బయట తాగొచ్చని సౌగతా రాయ్ పేర్కొనగా గజేంద్ర సింగ్ జోక్యం చేసుకొని.. ‘ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నావ్. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం శిక్షార్హమైన నేరం. ఒక ఎంపీగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఆలోచించాలి’ అన్నారు. అయితే, 2019లో ఈ-సిగరేట్లను నిషేధించారని, పార్లమెంట్ ఆవరణలో ఎంపీ వాటిని ఉపయోగిస్తే అది సభ గౌరవానికి అవమానమని కేంద్రమంత్రులు పేర్కొన్నారు.
అయితే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఇది చిన్న విషయమంటూ తోసిపుచ్చారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. తాను సభలో లేనని.. ఎవరు ఫిర్యాదు చేశారో తనకు తెలియదన్నారు. ఇది స్పీకర్‌కు సంబంధించిన విషయమన్నారు. పార్లమెంట్ వెలుపల ధూమపానం వెలుపల ధూమపానం అనుమతి ఉంటుందని.. లోపల కాదని రాయ్ స్పష్టం చేశారు. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ విషయంలో బీజేపీ ఆరోపణలను మండిపడ్డారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో వందలాది మంది ఎంపీలు ధూమపానం చేస్తున్నారని ఆజాద్ విమర్శించారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అనురాగ్ ఠాకూర్ టీఎంసీ ఎంపీపై ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తుకు ఆదేశించాలని ఠాకూర్ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. నిబంధనల ఉల్లంఘనను సహించబోమని, సభ నిబంధనల ప్రకారం దర్యాప్తు నిర్వహిస్తామని స్పీకర్ ఆయనకు హామీ ఇచ్చారు.