నాసిక్, ఆగస్టు 21: ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సుంకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో ఉల్లి రైతులు ఆందోళనలు చేపట్టారు. సోమవారం నాసిక్ జిల్లాలో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నాసిక్-ఔరంగాబాద్ హైవేపై బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యోలా వ్యవసాయ మార్కెట్ వద్ద శేత్కరీ సంఘటన్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ప్రకృతి విపత్తులతో ఇప్పటికే చాలా నష్టాలు చవిచూశామని, ఇప్పుడు ఎగుమతులకు అవకాశం లేకుండా చేస్తున్న 40 శాతం సుంకం వాటిని మరింత పెంచుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉల్లి వేలంలో పాల్గొనం
నాసిక్‌లోని లాసల్గావ్తోపాటు అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఉల్లి వేలం ప్రక్రియను నిరవధికంగా నిలిపివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం జిల్లాలోని అన్ని ఏపీఎంసీల్లో వేలం ఆగిపోయింది. సుంకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకొనే వరకు ఉల్లి వేలంలో పాల్గొనకూడదని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది.