లక్నో: గొడవ నేపథ్యంలో భార్య పెదవిని భర్త కొరికాడు. (Husband Bites Wife’s Lip) దీంతో విపరీతంగా రక్తం కారింది. ఆసుపత్రికి వెళ్లగా గాయమైన ఆమె పెదవిని డాక్టర్లు పరిశీలించారు. పెదవికి 16 కుట్లు వేశారు. ఆ మహిళ ఫిర్యాదుతో భర్త, ఆమె అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం నాగ్లా భూచన్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఇంట్లో పనులు చేస్తున్నది. ఆమె భర్త విష్ణు ఇంటికి తిరిగి వచ్చాడు. భార్యతో గొడవపడ్డాడు. దీంతో శాంతించాలని ఆమె అన్నది.
కాగా, ఆగ్రహించిన విష్ణు తన భార్యను కొట్టాడు. అకస్మాత్తుగా ఆమె పెదవిని కొరికాడు. దీంతో రక్తం కారింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ తండ్రి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. భర్త విష్ణు కొరికిన ఆ మహిళ పెదవిని డాక్టర్లు పరిశీలించారు. తీవ్ర గాయం కావడంతో 16 కుట్లు వేశారు.
మరోవైపు ఆ మహిళ తన తండ్రితో కలిసి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, అత్త, బావ తనను కొట్టి దూషించినట్లు ఆరోపించింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.