లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మరణమృదంగం (UP Hospital Deaths) మోగుతున్నది. బల్లియా జిల్లా ఆసుపత్రిలో గత మూడు రోజుల్లో 54 మంది రోగులు మరణించారు. ఈ నెల 15న 24 మంది రోగులు, 16న 20 మంది, 17న మరో 11 మంది రోగులు చనిపోయారు. అలాగే 72 గంటల్లో 400 మంది ఆసుపత్రి పాలయ్యారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని డాక్టర్లు తెలిపారు. అయితే రోగుల మరణాలకు వేర్వేరు కారణాలున్నప్పటికీ, తీవ్రమైన వేడిమి కూడా ఒక కారణమని చెప్పారు. తీవ్ర ఎండ వల్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కే యాదవ్ అన్నారు.
కాగా, బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఒక్కసారిగా రోగుల తాకిడి పెరుగడంపై వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఏదైనా గుర్తించని వ్యాధి కారణమా అన్నది పరిశోధించేందుకు లక్నో నుంచి ఒక వైద్య బృందం వస్తున్నట్లు అజంగఢ్ సర్కిల్ అదనపు ఆరోగ్య డైరెక్టర్ డాక్టర్ బీపీ తివారీ తెలిపారు. చాలా వేడిగా లేదా చల్లగా ఉన్నప్పుడు శ్వాసకోశ రోగులు, మధుమేహ రోగులు, రక్తపోటు రోగులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఎండల తీవ్రత పెరుగడం కూడా రోగుల అధిక మరణాలకు కారణం కావచ్చని అన్నారు.
మరోవైపు బల్లియా జిల్లా ఆసుపత్రికి రోగులు క్యూకడుతున్నారు. స్ట్రెచర్లు కూడా పొందలేనంతగా రోగుల రద్దీ ఉంది. దీంతో చాలా మంది తమ వారిని భుజాలపై మోసుకెళ్లి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్తున్నారు. కాగా, ఆ ఆసుపత్రిలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు యూపీ ఆరోగ్య మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. డైరెక్టర్ స్థాయికి చెందిన ఇద్దరు సీనియర్ డాక్టర్లను అక్కడకు పంపినట్లు చెప్పారు. రోగుల మరణాలు, ఆసుపత్రిలో పరిస్థితిపై వారు నివేదిక ఇస్తారని అన్నారు. అయితే సరైన సమాచారం లేకుండా వడదెబ్బ వల్ల 34 మంది రోగులు చనిపోయినట్లు శుక్రవారం ప్రకటించిన చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దివాకర్ సింగ్ను ఆ పోస్ట్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు.