Cheating | ఆయన దుబాయ్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వర్తిస్తున్న ఎన్నారై.. ఆయన పేరు అబ్దుల్ లాహిర్ హసన్. ఆయన తన కూతుర్ని కేరళలోని కాసర్గోడ్ వాసి మహమ్మద్ హఫీజ్‌కు ఇచ్చి 2017లో పెండ్లి చేశాడు. కానీ, ఐదేండ్ల తర్వాత తన అల్లుడిపైనే పోలీసులకు హసన్ ఫిర్యాదు చేశారు. తన కూతురుకి బహుమతులుగా ఇచ్చిన 1000 సవర్ల బంగారం ఆభరణాలతోపాటు రూ.107 కోట్లకు తనను మోసగించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాదు కొన్ని తన ఆస్తులపై మహమ్మద్ హఫీజ్ యాజమాన్య హక్కులు కూడా పొందాడని ఫిర్యాదులో హసన్ తెలిపాడు. మూడు నెలల క్రితం అలువా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ హఫీజ్.. ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు సమాచారం. అలువా పోలీసులు ఈ కేసు దర్యాప్తును కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని అరెస్ట్ చేయడంలో గానీ, కనీసం పిలిచి విచారించడంలో గానీ పోలీసులు విఫలం అయ్యారని హసన్ ఆరోపించాడు. హఫీజ్ వ్యక్తిగత అవసరాలకు వాడుకునేందుకు ఇచ్చిన రూ.1.5 కోట్ల విలువైన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోయారన్నాడు.
భూమి కొనుగోలు, ఫుట్‌వేర్ షోరూమ్ తదితర పేర్లతో తన వద్ద నుంచి రూ.92 కోట్లకు పైగా డబ్బు తీసుకున్నడని ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ హసన్ చెప్పాడు. తనతోపాటు మరొక వ్యక్తి అక్షయ్ థామస్ వైద్యన్ కూడా ఉన్నాడని హసన్ అల్లుడు హఫీజ్ చెబుతున్నాడని ఓ పోలీసు అధికారి చెప్పారు. హఫీజ్, అతడి అనుచరుడి పేర్లు హసన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు.