BJP | న్యూఢిల్లీ, మే 27: దేశ చరిత్రను చెరిపేందుకు బీజేపీ నడుం బిగించింది. ఇటీవల డార్విన్ సిద్ధాంతాన్ని సిలబస్ నుంచి తొలగించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా జాతిపిత గాంధీజీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులకు దూరం చేసేందుకు పూనుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఈ మేరకు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ చర్యను ప్రొఫెసర్లు, కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించారు. గాంధీజీ స్థానంలో హిందూత్వ నేత సావర్కర్ పాఠ్యాంశాన్ని సిలబస్లో చేర్చేందుకు యూనివర్సిటీ ప్రతిపాదించింది.
బీఏ (హానర్స్) పొలిటికల్ సైన్స్ ఐదో సెమిస్టర్లో గాంధీజీ పాఠ్యాంశం ఉంది. దీనిని తొలగించి స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధమే లేని సావర్కర్ చరిత్రను చేర్చేందుకు బీజేపీ కుట్రలకు తెరలేపింది. ఈ ప్రతిపాదనను కొంతమంది కౌన్సిల్ సభ్యులు, ప్రొఫెసర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీని వల్ల మూడేండ్ల కోర్సు చదివేవారికి గాంధీజీ గురించి తెలుసుకునే అవకాశం ఉండదని ప్రొఫెసర్లు తెలిపారు. ఈ చర్యను కాషాయీకరణగా వారు అభివర్ణించారు. ‘సారే జహా సే అచ్ఛా’ గీత రచయిత మహమ్మద్ ఇక్బాల్ పాఠ్యాంశాన్ని తొలగించే వివాదాస్పద ప్రతిపాదనను బీజేపీ తీసుకొచ్చింది.