న్యూఢిల్లీ,: ప్రముఖ యూనిలీవర్ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న డ్రైషాంపూల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలింది. కంపెనీకి చెందిన డవ్‌తో పాటు ఇతర ఏరోసోల్ డ్రై షాంపూల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు గుర్తించిన నేపథ్యంలో.. ఆయా ఉత్పత్తులను రీకాల్ (వెనక్కి తీసుకోవడం) చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. యూనిలీవర్ రీకాల్ చేసిన షాంపు బ్రాండుల జాబితాలో డవ్ పాటు నెక్సస్, సువావే, ట్రెస్మే, టిగి ఉన్నాయి. రీకాల్ చేసిన వాటిల్లో 2021 అక్టోబర్ ముందు తయారు చేసిన షాంపూ ఉత్పత్తులు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ మేరకు సంబంధిత వివరాలతో అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) తాజాగా తన వైబ్సైట్లో ఓ నోటీసు పోస్టు చేసింది. ప్రోడక్టు స్ప్రే ప్రక్రియ కోసం వినియోగించే ప్రొపల్లెంట్స్ ఏరోసోల్స్‌లో ప్రధాన సమస్యగా ఉన్నదని యూనిలీవర్ పేర్కొన్నది. డ్రై షాంపూల రీకాల్‌కు ఇదీ కారణమని తెలిపింది.
సేఫ్టీపై అనుమానాలు
తాజా పరిణామం నేపథ్యంలో పర్సనల్ కేర్ ప్రోడక్టులలో ఏరోసోల్స్ ఉత్పత్తుల సేఫ్టీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గత ఏడాదిన్నరగా పలు ఏరోసోల్ సన్స్క్రీన్లను సంస్థలు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నాయి. వీటిలో జాన్సన్ అండ్ జాన్సన్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కోకు చెందిన బనానా బోట్, ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్ కో సీక్రెట్, ఓల్డ్ స్పైస్, యూనిలీవర్ సేవేవ్ ఉన్నాయి. స్ప్రే ఆన్ డ్రై షాంపుల్లో ఇటువంటి సమస్యను కనుగొనడం ఇదే తొలిసారి కాదు. ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్లో తన ప్యాంటీన్, హెర్బల్ ఎసెన్స్ డ్రై షాంపూలను రీకాల్ చేసింది. ఆ సమయంలో కూడా క్యాన్సర్ కారకం బెంజీన్ ఆయా ఉత్పత్తుల్లో ఉన్నట్టు గుర్తించింది. ఏరోసోల్ డ్రై షాంపూలు వంటి ఇతర కన్జూమర్ ప్రోడక్టు క్యాటగిరీల్లో అత్యధికంగా బెంజీన్ ఉండటం దురదృష్టకరమని, దీనిపై విచారణ చేపడుతున్నామని వాలిస్యూర్ ల్యాబ్ సీఈవో డేవిడ్ తెలిపారు.