బరేలీ: ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని బరేలీలో ఓ పెళ్లికొడుకు తాగిన మైకంలో.. వధువు బెస్ట్ ఫ్రెండ్ మెడలో పూలమాల వేశాడు. దీంతో వధువు సీరియస్ అయ్యింది. పెళ్లి కొడుకు చెంపచెల్లుమనిపించింది. ఆ తర్వాత అక్కడ నుంచి అలిగి వెళ్లిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవైంది. ఈ ఘటనకు చెందిన వివరాల్లోకి వెళ్తే..
పెళ్లి కూతురు పేరు రాధా దేవి. ఆమె వయసు 21 ఏళ్లు. పెళ్లికుమారుడి పేరు రవీంద్ర కుమార్. అతని వయసు 26 ఏళ్లు. పెళ్లి వేదిక వద్దకు బరాత్‌తో వచ్చిన వరుడు.. తాగిన మత్తులో వధువు మెడలో కాకుండా.. ఆమె పక్కనే ఉన్న బెస్ట్ ఫ్రెండ్ మెడలో పూలమాల వేశాడు. అదనపు అడిగిన వరుడు.. తాగి పెళ్లికి వచ్చినట్లు తెలిసింది. వెడ్డింగ్‌కు ముందు 2.5 లక్షలు, పెళ్లి రోజు మరో 2 లక్షలు ఇచ్చారు పెళ్లికూతురు తండ్రి. అయినా సంతృప్తి చెందని పెళ్లికుమారుడు.. తన ఫ్రెండ్స్‌తో కలిసి తాగి పెళ్లి వేదిక వద్దకు వచ్చాడు.
తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్న వరుడు.. ఫ్రెండ్స్‌తో తాగి వచ్చి కావాలని పెళ్లికూతురి కుటుంబంతో అమర్యాదగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. పూలమాలను మార్చుకునే సమయంలో.. అనుకోకుండా పెళ్లికూతురి మెడలో కాకుండా.. ఆమె పక్కనే ఉన్న మరో అమ్మాయి మెడలో మాలను వేశాడు. దీంతో ఆగ్రహించిన రాధాదేవి.. వరుడి చెంపపై కొట్టి, అక్కడ నుంచి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పింది. అబ్బాయి కుటుంబంపై ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.