లక్నో: ఒక వ్యక్తి పక్క రాష్ట్రంలో జరిగిన పార్టీకి వెళ్లాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ తిరుగు ప్రయాణమయ్యాడు. గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యాడు. ఈ నేపథ్యంలో రైలు పట్టాలపైకి కారును డ్రైవ్ చేశాడు. (Man Drives Onto Railway Tracks) గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన ఆదర్శ్ రాయ్, ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పూర్‌కు కారులో వెళ్లాడు. అక్కడ పార్టీ తర్వాత సొంత గ్రామానికి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు.
కాగా, మద్యం సేవించిన ఆదర్శ్, గూగుల్ మ్యాప్‌లో పూర్తి చిరునామాకు బదులు గ్రామం పేరు మాత్రమే ఎంటర్ చేశాడు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని డోమింగర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పైకి కారును డ్రైవ్ చేశాడు. రైలు పట్టాల పక్కన ఉన్న కంకర రాళ్లలో టైర్లు కూరుకుపోయాయి. దీంతో కారు అక్కడ చిక్కుకుపోయింది.
మరోవైపు ఆ ట్రాక్‌పై గూడ్స్ రైలు వస్తున్నది. అయితే రైలు పట్టాల పక్కన కారు ఉండటాన్ని లోకో పైలట్ సకాలంలో గమనించాడు. ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో ఐదు మీటర్ల దూరంలో గూడ్స్ రైలు ఆగింది. ఈ విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ఆ కారును పక్కకు తొలగించారు. ఆదర్శ్ రాయ్ మద్యం మత్తులో ఉన్నట్లు గ్రహించి అరెస్ట్ చేశారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.