న్యూఢిల్లీ: భవిష్యత్తు అంతా డ్రైవర్‌లెస్ కార్లదేనని టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ఎల్లుస్వామి వెల్లడించారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. భారత సంతతికి చెందిన ఆయన విద్యుత్తు కార్ల తయారీ, ఎలాన్ మస్క్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 2035 నాటికి రోడ్లపై డ్రైవర్‌లెస్ కార్లదే ఆధిపత్యమని పేర్కొన్నారు.
ఇక నడిపే కారు కావాలంటే పాతవే వాడాల్సి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. అమెరికాలోని అన్ని నగరాల్లో ఇకపై డ్రైవర్‌లెస్ కార్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇవి ఏఐ ఆధారితంగా పనిచేస్తాయని వెల్లడించారు. ఇక టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పనితీరుపై స్పందిస్తూ రిస్క్ తీసుకోవడానికి ఆయన ఎన్నడూ వెనుకడుగు వేయరని తెలిపారు.
వారానికి 80-90 గంటలు ఆయన పనిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన పనితీరే సంస్థ ఉన్నతికి కారణమని పునరుద్ఘాటించారు. ఇక టెస్లా ఆటో పైలెట్ బృందంలో మొదటగా చేరిన వ్యక్తిగా అశోక్ ఎల్లుస్వామి నిలిచారు. కృత్రిమమేధతో టెస్లా సాధించిన విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.