Kanchenjunga Express train accident : కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఇక ఈ ఘటనలో గూడ్స్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్‌తో పాటు, కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ గార్డు మరణించారని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో జయ వర్మ సిన్హా వెల్లడించారు. కాగా, అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ (Kanchanjunga Express) రైలును న్యూజల్పాయ్ గుడి జంక్షన్ సమీపంలోని రంగపాని స్టేషన్ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది.
ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తేనే తెలుస్తోంది ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
పలు రైళ్లు దారి మళ్లింపు..
రెండు రైళ్లు ఢీ కొట్టడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. ఘటన సమాచారం అందుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
Read More :
Keesara | కీసరలో 500 కోట్లకు పైగా భూ కుంభకోణం.. కాస్తులో ఉన్నా రికార్డుల్లో పేర్లు తారుమారు