గొంతు తడిపే నీళ్లు గరళమై ప్రాణాల్నే కబళిస్తుంటే.. బాధ్యతగల ప్రభుత్వాలు ఏం చేయాలి? కాలకూట విషాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి. సాధ్యం కానప్పుడు, ప్రత్యామ్నాయం చూపి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందీ.. యూపీలో యోగి సర్కార్ చేయలేకపోయిందీ అదే.
ఏడున్నర దశాబ్దాలుగా గుక్కెడు నీటి కోసం గుక్కపట్టి ఏడ్చిన నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తాగేనీటినీ తినేతిండినీ మట్టిపొరల్లోని గరళం కలుషితం చేస్తుంటే, చెయ్యని నేరానికి వేలాదిమంది శిక్ష అనుభవిస్తుంటే.. ఉద్యమనాయకుడిగా ఆ బాధను ప్రత్యక్షంగా చూసి కేసీఆర్ చలించిపోయారు. తెలంగాణ రాష్ర్టావిర్భావం తర్వాత పరిష్కారంపై దృష్టిపెట్టారు. మిషన్ భగీరథతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంచినీళ్లు అందించి కన్నీళ్లు తుడిచారు.
మరి పార్లమెంటుకు అత్యధిక ఎంపీలను అందించే పేరు గొప్ప ఉత్తరప్రదేశ్.. తమ రాష్ట్రంలోని ఈ తరహా సమస్యపై ఎలా స్పందించాలి? క్యాన్సర్ కారకాల కారణంగా విషతుల్యమైన భూగర్భ జలాలతో గాంగ్నౌలీ, పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. అక్కడి బీజేపీ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. హాలాహలానికి 48 గ్రామాల ప్రజలు పిట్టల్లా రాలుతుంటే యోగి సర్కారు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని గాంగ్నౌలీ గ్రామాన్ని క్యాన్సర్ రక్కసి పట్టిపీడిస్తున్నది. భూగర్భ జలం గరళంగా మారి పల్లెజనం ఉసురు తీస్తున్నది. ఇది ఆ ఒక్క ఊరికి పరిమితం కాలేదు. చుట్టుపక్కల 48 గ్రామాల ప్రజలను విషపూరిత కార్సినోజెన్స్ కారకాలు కాటేసేలా తయారైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఎన్ని ఆదేశాలిచ్చినా.. అక్కడి బీజేపీ ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తున్నది. నిరసన తెలిపే వారి ఇండ్లపైకి ఆగమేఘాలపై బుల్డోజర్లను ప్రయోగించే యోగి ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలు పోతుంటే ఏండ్లకేండ్లుగా పట్టించుకోకపోవడం వివాదాస్పదమవుతున్నది. డబుల్ ఇంజిన్ ప్రగతి అంటే, ప్రజలపట్ల బాధ్యతకు నీళ్లొదలడమేనా అని విమర్శలు వస్తున్నాయి. యూపీ డొల్లతనంపై అల్‌జజీరా కథనం ప్రసారం చేసింది.
300 మంది వరకు బలి?!
యూపీలోని గాంగ్నౌలీ గ్రామం జనాభా 5వేలు. వారిలో 90% మందిని ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధిస్తూనే ఉన్నది. శారీరక ఎదుగుదలలో లోపం, కాలేయ సమస్యలు, ఎముకల క్షీణత, క్యాన్సర్‌తో గ్రామస్థులు వారానికి నాలుగుసార్లు దవాఖాన బాటపడుతున్నారు. గ్రామంలోని యువతలో మూడోవంతు మంది మంచానికే పరిమితమయ్యారు. దవాఖాన ఖర్చుల కోసం ఏకంగా 200 కుటుంబాలు భూములను అమ్ముకున్నాయంటే గాంగ్నౌలీలోని సమస్య తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. ఎన్జీటీ-2019 నివేదిక ప్రకారం.. క్యాన్సర్‌తో 2013-2018 మధ్య 71 మందికి పైగా మృత్యువాతపడ్డారు. అనధికారికంగా ఈ సంఖ్య 300 వరకూ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
భూగర్భ జలమంతా విషమే..
గాంగ్నౌలీ ఎగువన ఉన్న గోబా ప్రాంతంలో చక్కెర, కాగితం, హెయిర్‌డై మేకింగ్ వంటి పరిశ్రమలతోపాటు జంతువధ కేంద్రాలు పెద్దయెత్తున ఉన్నాయి. ఈ పరిశ్రమల్లోని వ్యర్థాలు గంగా, యమునా నదులతోపాటు కాళీ, కృష్ణ, హిందోన్ వంటి ఉపనదుల్లోనూ కలుస్తున్నాయి. దీంతోపాటు మీరట్, బాగ్పట్, సహారన్పూర్, గౌతమ్‌బుద్ధనగర్, ఘజియాబాద్ శివారులోని రసాయన పరిశ్రమల వ్యర్థాలు కూడా ఈ నదీ జలాల్లోనే చేరుతున్నాయి. దీంతో ప్రమాదకరకార్సినోజెన్స్తో పాటు అర్సెనిక్, పాదరసం, సీసం, జింక్, ఫాస్పేట్, సల్ఫైడ్, కాడ్మియం, మెగ్నీషియం వంటి కారకాలు ఆ జలాల్లో చేరుతున్నాయి. ఈ కలుషిత నదీజలాలు గాంగ్నౌలీ పరిసర ప్రాంతాల్లోని కుంటల్లో కలుస్తున్నాయి. గడిచిన 20 ఏండ్లలో గ్రామం చుట్టుపక్కల ఉన్న భూగర్భ జలాలు తీవ్రస్థాయిలో విషపూరితమయ్యాయి. ఇంటింటికీ నల్లా నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో చేతిపంపు ద్వారానే ప్రజలు ఈ కలుషిత నీటిని తోడుకుని తాగుతున్నారు. దీంతో రోగాలబారిన పడుతున్నారు.
ఇంటింటి సర్వేకు ఆదేశాలిచ్చినా..
గాంగ్నౌలీ సహా మరో 48 గ్రామాల్లోని భూగర్భ జలాలు కలుషితమైనట్టు ఫిర్యాదులు రావడంతో ఇంటింటి సర్వే నిర్వహించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)రాష్ట్ర ఆరోగ్యశాఖకు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో యోగి సర్కారుపై మండిపడిన ఎన్జీటీ.. పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలువకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తమ ఆదేశాలు ఏ మేరకు అమలయ్యాయో నివేదిక సమర్పించాలని పేర్కొంటూ, పర్యవేక్షణకు 2018లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 2019నుంచి ఇప్పటివరకు నాలుగు నివేదికలను సమర్పించిన ఆ కమిటీ.. గ్రామస్థుల ఆరోగ్య రక్షణకు అధికారులు ఏ చర్యలూ చేపట్టలేదని కుండబద్దలు కొట్టింది. దీంతో రాష్ట్రప్రభుత్వం తమకు సహకరించట్లేదని ఎన్జీటీ బహిరంగంగానే ఎండగట్టింది.
ఫ్లోరోసిస్ అంతానికి ప్రతినబూని..
‘నల్లగొండ నేలపై కృష్ణమ్మను పారించాలె. ఫ్లోరైడ్ని బొంద పెట్టాలె’ అని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే మహమ్మారిని తరిమికొట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకొన్నారు. నల్లగొండ జిల్లాలోని పల్లెపల్లెకు భగీరథ పైపు.. ఇంటింటికీ కృష్ణా నీళ్లు వచ్చేలా చేశారు. దీంతో ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉండే మర్రిగూడ మండలంలో గడిచిన ఆరేండ్లలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మునుగోడు, నాంపల్లి, చండూరు, చౌటుప్పల్, నారాయణపురం, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, పెద్దఅడిశర్లపల్లి, మల్లేపల్లి, డిండి, నేరేడుగొమ్మెతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు దాదాపుగా కనిపించడంలేదు. ఫ్లోరైడ్ అంతానికి తెలంగాణ సర్కారు చేసిన కృషికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
వచ్చి ఐదేండ్లేగా అయ్యింది
మేము అధికారంలోకి వచ్చి ఐదేండ్లేగా అయ్యింది. ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించమంటే ఎలా? గత ప్రభుత్వాల వల్లే ఈ పరిస్థితులు దాపురించాయి. దానికి యోగి సర్కారును తప్పుబట్టడం ఏంది? ఇప్పుడు గాంగ్నౌలీ గ్రామప్రజలకు దక్కుతున్న ఆ మాత్రం సౌకర్యాలు కూడా మా బీజేపీ ప్రభుత్వం వల్లేనని గుర్తుంచుకోవాలి.
కృషన్పాల్సింగ్ (బీజేపీ ఎమ్మెల్యే)