Karnataka | బెంగళూరు, మార్చి 3: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగుళూరులో తాగునీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇష్టమున్నట్టు ధరలు వసూలు చేస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సామాన్యులు, ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో నగరంలోని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకోనున్నట్టు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ప్రకటించారు. ప్రైవేట్ బోర్వెల్ నిర్వాహకులు, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ యజమానులు ‘బెంగళూరు వాటర్ సైప్లె, సీవరేజ్ బోర్డ్’ (బీడబ్ల్యూఎస్ఎస్బీ) వద్ద మార్చి 7లోగా రిజిష్టర్ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది.
బెంగళూరులో వైట్‌ఫీల్డ్, వర్తూర్, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో నీటి సరఫరా పూర్తిగా స్తంభించిపోయింది.‘వాటర్ ట్యాంకర్ ధరలు డబుల్ అయ్యాయి. ఫిబ్రవరిలో రూ.4,000 ఖర్చు చేశాం. తాగునీటి కోసం వాటర్ క్యాన్లు కొన్నాం’ అని 35 ఏండ్ల సమీనా తాజ్ చెప్పారు. సామాన్యులే కాదు, అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నవారు కూడా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ధరలను భరించలేకపోతున్నారు.