న్యూఢిల్లీ: కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏవైనా వస్తువుల దిగుమతికి అనుమతి ఇచ్చిన తర్వాత, ఆ వస్తువులపై సుంకాలను చెల్లించాలని కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం డీఆర్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్) అధికారులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 28 ప్రకారం షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి డీఆర్ఐ అధికారులు “తగిన అధికారులు కాదు” అని 2021లో అప్పటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.
ఈ తీర్పును సమీక్షించాలని కస్టమ్స్ శాఖ రివ్యూ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, 2021నాటి తీర్పును తోసిపుచ్చింది. ఈ చట్టం ప్రకారం షోకాజ్ నోటీసులను జారీ చేసి, సుంకాలను రాబట్టే అధికారం డీఆర్ఐ అధికారులకు ఉందని స్పష్టం చేసింది. అనేక కంపెనీలు సుంకాలను చెల్లించకుండా బాకీ పెడుతున్న నేపథ్యంలో ఈ తీర్పు డీఆర్ఐకి గొప్ప బలాన్ని ఇచ్చింది.