Birdev Siddhappa | ముంబై, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : గొర్రెలను మేపుతూ సంచార జీవనం సాగించే ఒక గొర్రెల కాపరి కుమారుడు సివిల్స్ ఎంట్రన్స్‌లో 551 ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన గొర్రెల కాపరి కుమారుడు బీర్ దేవ్ సిద్ధప్ప దోనే ఈ ఘనత సాధించాడు. యూపీఎస్సీ సివిల్స్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల చేసిన సమయంలో బీర్ దేవ్ తండ్రితో కలిసి కర్ణాటక, బెల్గాంలోని అథని గ్రామానికి గొర్రెల మందను తీసుకుని వెళ్లాడు.
ఫలితం తెలిసిన వెంటనే అథనిలోని స్థానిక గొర్రెల కాపరులు బీర్ దేవ్‌కు ధన్ గర్ తలపాగా చుట్టి ఒక మేకను బహుమతిగా ఇచ్చి సతరించారు. కొల్హాపూర్ జిల్లా కాగల్ తాలూకాలోని యామగే గ్రామానికి చెందిన బీర్ దేవ్ దోనె తండ్రి గొర్రెల పెంపకం చేస్తూ సంచార జీవనం సాగించే వాడు. బీర్ దేవ్ చదువుకునే రోజుల నుంచే ఐపీఎస్ కావాలనుకుని కలలు కని, ఆ మేరకు ప్రయత్నాలు చేశాడు. రెండు సార్లు ఫెయిల్ అయినా పట్టు వదలలేదు. 27 సంవత్సరాల వయసులో మూడో ప్రయత్నంలో 551 ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకుతో బీర్ దేవ్ దోన్కు ఐపీఎస్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది.