న్యూఢిల్లీ, నవంబర్ 14 : భారత దేశ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో గైడెడ్ పినాక ఆయుధ వ్యవస్థ ప్రయోగ పరీక్షను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ప్రావిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వయిర్మెంట్స్ (పీఎస్క్యూఆర్) ధ్రువీకరణ ప్రయోగాలలో భాగం గా దీనిని పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. పినాక అనేది పూ ర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన బహుళ రాకెట్ లాంచర్. దీనిని భారత సైన్యం కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగ పరీక్షలు మూడు దశల్లో వేర్వేరు ఫైరింగ్ రేంజుల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో భాగంగా పీఎస్క్యూఆర్ పారామితులైన రేంజింగ్, కచ్చితత్వం, స్థిరత్వం తదితర అంశాలను విస్తృతమైన పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. రెండు ఇన్ సర్వీస్ పినాక లాంచర్ల ద్వారా ఒక్కో ప్రొడక్షన్ ఏజెన్సీ నుంచి 12 రాకెట్లను పరీక్షించారు.