న్యూఢిల్లీ, డిసెంబర్ 2: యుద్ధ విమానాల నుంచి పైలట్ సురక్షితంగా తప్పించుకునే.. ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించి ‘హై-స్పీడ్ రాకెట్ స్లెడ్’ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. తద్వారా ఈ టెక్నాలజీని కలిగిన అతికొద్ది దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. చండీగఢ్‌లోని స్లెడ్ కేంద్రం వద్ద గంటకు 800 కిలోమీటర్ల వేగంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తీవ్రమైన పరిస్థితుల్లో యుద్ధ విమానం పైలట్ ఎస్కేప్ వ్యవస్థ అత్యంత కచ్చితంగా పనిచేసినట్టు పేర్కొన్నది. టెస్ట్‌కు సంబంధించిన వీడియోను రక్షణ శాఖ సోషల్‌మీడియాలో విడుదల చేసింది. యుద్ధ విమానంలోని డమ్మీ పైలట్ ఫైటర్ జెట్ కాక్‌పిట్ నుంచి సురక్షితంగా బయటపడిన తీరు ఇందులో చూపారు.