న్యూఢిల్లీ, జనవరి 28 : వికసిత్ భారత్, స్వదేశీ ప్రచారంతోపాటు జాతీయ భద్రత కోసం పార్లమెంట్ సభ్యులంతా ఐక్యంగా నిలబడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈ అంశాలన్నీ రాజకీయ విభేదాలకు అతీతమైనవని ఆమె స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ సంస్కరణల ఎక్స్‌ప్రెస్ వేగాన్ని ప్రభుత్వం మరింత పెంచుతూనే ఉంటుందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సాయుధ దళాల పరాక్రమాన్ని యావత్ ప్రపంచం చూసిందని, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని ఆమె అన్నారు. తన ప్రసంగంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్, జయప్రకాష్ నారాయణ్, లోహియా, పండిట్ దీన్‌దయాళ్, వాజ్‌పేయిలను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, కాని కొన్ని అంశాలు విభేదాలకు అతీతమన్న విశ్వాసాన్ని వారు చాటిచెప్పారని రాష్ట్రపతి అన్నారు. వికసిత్ భారత్, దేశ భద్రత, ఆత్మనిర్భరత, స్వదేశీ ప్రచారం, జాతీయ సమైక్యత కోసం కృషి, స్వచ్ఛత వంటి అంశాలు దేశానికి సంబంధించినవని, వీటి విషయంలో పార్లమెంట్ సభ్యులందరూ ఐక్యంగా నిలబడాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించేందుకు యూజీసీ జారీచేసిన కొత్త నిబంధనలపై కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ దళితులు, వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు, గిరిజన వర్గాలు సహా అందరి కోసం ప్రభుత్వం పూర్తి స్పృహతో పనిచేస్తున్నదని ముర్ము తెలిపారు
వికసిత్ భారత్, వీబీ-జీ రామ్ జీ పథకం గురించి రాష్ట్రపతి ప్రస్తావించినపుడు విపక్ష సభ్యుల నుంచి పెద్ద పెట్టున నిరసనలు వ్యక్తమయ్యాయి. వీబీ-జీ రామ్ జీ పథకం గురించి ఆమె మాట్లాడుతున్న సమయంలో దాన్ని ఉపసంహరించుకోవాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ తయారీ, సేవా రంగాలకు ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు దేశ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని రాష్ట్రపతి తెలిపారు.