కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకుంది. ఈ దవాఖానలో ఆగస్ట్ 9న ఓ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో డాక్టర్ సందీప్‌ను సీబీఐ 15వ రోజు ప్రశ్నించిన తర్వాత కోల్‌కతాలోని నిజాం ప్యాలెస్ ఆఫీస్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే కలకత్తా హైకోర్టు ఈ దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది.
ముంబై, సెప్టెంబర్ 2: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితేశ్ రాణే ముస్లింలపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. ‘రామ్‌గిరి మహారాజ్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, మసీదుల్లో చొరబడి, ఒక్కొక్కరి సంగతి చూస్తాం. జాగ్రత్త..!’ అంటూ బెదిరింపులకు దిగారు. ఆదివారం (సెప్టెంబర్ 1) అహ్మద్‌నగర్ జిల్లాలో నిర్వహించిన రెండు సభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల ఆగస్టు 14న నాసిక్‌లో రాణే చేసిన విద్వేష ప్రసంగం కారణంగా ఛత్రపతి శంభాజీ నగర్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీనిపై ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు గైక్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, అహ్మద్‌నగర్ పోలీసులు రాణేపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు.