కోల్‌కతా: ఇటీవల పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నియమితులైన డాక్టర్ సీవీ ఆనందబోస్ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య తగాదాలతో రాజకీయంగా సున్నితమైన రాష్ట్రంగా ఉన్న బెంగాల్‌కు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించడమంటే పెను సవాలే. సీవీ ఆనందబోస్ ఈ సవాల్‌ను ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందిన సీవీ ఆనందబోస్ 1977 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. కేరళలో జిల్లా కలెక్టర్‌గా, యూనివర్సిటీ వీసీగా, రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రెటరీగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులలోకి వెళ్లారు. అంతేగాక రచయితగా కూడా సీవీ ఆనందబోస్‌కు మంచి పేరుంది.
హిందీ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ఆయన 40కి పైగా పుస్తకాలు వెలువరించారు. అంతేగాక నవలలు, కథలు, పద్యాలు, వ్యాసాలు కూడా రాశారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన సేవలకుగాను మొత్తం 29 అంతర్జాతీయ, జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. 1951, జనవరి 2న కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని మన్నానమ్ గ్రామంలో ఆనందబోస్ జన్మించారు.
ఆనందబోస్ తండ్రి పీకే వాసుదేవన్ నాయర్ స్వాతంత్య్ర సమరయోధుడు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు అనుచరుడు. ఆయన మీద అభిమానంతోనే వాసుదేవన్ తన కుమారుడి పేరు వెనుక బోస్ అని పెట్టుకున్నారు. బోస్ తన విద్యాభ్యాసం పూర్తవగానే ఇంగ్లిష్ లెక్చరర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. అనంతరం స్టేట్ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 26 ఏండ్ల వయసులో ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు.