రాయ్‌పూర్, మార్చి 1: ప్రముఖ పురావస్తు శాఖ శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్‌కుమార్ శర్మ(90) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ప్రాంతాన్ని వెలికితీసిన శాస్త్రవేత్తల బృందంలో అరుణ్‌కుమార్ అత్యంత సీనియర్ సభ్యులు.
ఆ ప్రాంతంలోని ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని పేర్కొంటూ అరుణ్ కుమార్ టీమ్ న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. అయోధ్య వివాదాస్పద ప్రాంతంలో రాముడి ఆలయం ఉనికి ఉందన్న వాదనకు మద్దతుగా శర్మ పలు పురావస్తు ఆధారాలు సేకరించారు. వృత్తి నిబద్ధతకు పేరొందిన అరుణ్‌కుమార్ 83 ఏండ్ల వయసులో బస్తర్ రీజియన్‌లో నక్సల్స్ 67 ముక్కలుగా చేసిన గణేశుడి విగ్రహ పునరుద్ధరణ పనులను తన బృందంతో కలిసి వారంలో పూర్తి చేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.