న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య విభేదాల నేపథ్యంలో దౌత్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలోని రాయబారి, దౌత్య అధికారులను భారత్ వెనక్కి పిలిపించింది. (India recalls Canada envoy) ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తులో భారత రాయబారులపై కెనడా అభియోగాలు మోపింది. ఒట్టావాలోని భారత హైకమిషనర్, ఇతర దౌత్య అధికారులను ఈ కేసులో ‘ఆసక్తి ఉన్న వ్యక్తులు’గా ఆరోపించింది.
కాగా, భారత్ ఈ అంశంపై సీరియస్గా స్పందించింది. సోమవారం సాయంత్రం కెనడా వ్యవహారాల ఇన్చార్జ్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిపించింది. కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై నిరాధారమైన ఆరోపణలు ఆమోద యోగ్యం కాదని పేర్కొంది.
మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. కెనడాలోని భారత రాయబారులను వెనక్కి పిలిపించింది. ‘ఉగ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వం చర్యలు భారత ధౌత్యాధికారుల భద్రతకు అపాయం కలిగించేలా ఉన్నట్లు తెలుస్తున్నది. వారి భద్రతకు హామీ ఇవ్వడానికి ప్రస్తుత కెనడియన్ ప్రభుత్వం నిబద్ధతపై మాకు విశ్వాసం లేదు. అందువల్ల హైకమిషనర్, లక్ష్యంగా ఉన్న దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.