భువనేశ్వర్: ఆస్తి కోసం ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొడుకుతో కలిసి వృద్ధురాలైన తల్లి, సోదరిని హత్య చేశాడు. (Double Murder) అగ్నిప్రమాదంలో వారు చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం తెలియడంతో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 5న రాత్రి వేళ హటాపాడా ప్రాంతంలోని బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు, పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ నివసిస్తున్న 90 ఏళ్ల స్నేహలత దీక్షిత్, ఆమె కుమార్తె అయిన 62 ఏళ్ల సాయిరేంద్రి దీక్షిత్ కాలిన మృతదేహాలను గుర్తించారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఆస్తి తగాదాల నేపథ్యంలో పక్కా ప్లాన్‌తో ఇద్దరు మహిళల హత్య జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. స్నేహలత దీక్షిత్ కుమారుడు జగన్నాథ్ తన కుమారుడు సంకేత్‌తో కలిసి తల్లి, సోదరి గొంతునొక్కి హత్య చేశారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత వారి మృతదేహాలకు నిప్పుపెట్టి అగ్నిప్రమాదంలో చనిపోయినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారని చెప్పారు. స్నేహలత చిన్న కూతురు ఇంద్రాణి ఫిర్యాదు ఆధారంగా హతురాలి కొడుకు, మనవడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.