Sabarimala gold : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల (Sabarimala) గర్భగుడి బంగారు తాపడం చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భగుడి తలుపులను మార్చలేదని, వాటిపై ఉన్న రాగి రేకుల మీద నుంచి బంగారు పొరను నేర్పుగా దోచుకున్నారని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) శాస్త్రవేత్తలు సమర్పించిన నివేదికను, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బుధవారం కేరళ హైకోర్టు (Kerala High Court) కు సమర్పించింది.
గర్భగుడికి ఉన్నవి అసలైన రాగి రేకులేనని, వాటిని మార్చలేదని వీఎస్ఎస్సీ శాస్త్రవేత్తలు తమ నివేదికలో స్పష్టంచేశారు. తలుపుల చెక్క ఫ్రేమ్‌వర్క్ కూడా పాతదేనని నిర్ధారించారు. దొంగిలించబడింది ఘనమైన బంగారం కాదని, రాగి రేకులపై ఉన్న బంగారు పొర మాత్రమేనని తేల్చారు. కొన్ని రేకులపై బంగారం శాతం గణనీయంగా తగ్గడాన్ని బట్టి, రసాయనాలను ఉపయోగించి బంగారాన్ని వేరుచేసి ఉంటారని అంచనా వేశారు.
రేకులపై కనిపించిన మార్పులవల్ల వాటిని పూర్తిగా మార్చేసి ఉంటారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అయితే బంగారం వెలికితీతకు ఉపయోగించే పాదరసం వంటి రసాయనాల ప్రయోగం వల్లే వాటి ఉపరితలంలో మార్పులు వచ్చాయని, భౌతికంగా వాటిని మార్చలేదని శాస్త్రవేత్తలు వెల్లడిచేశారు. దాంతో అసలు రాగి రేకులను అంతర్జాతీయ ముఠాలకు విక్రయించి ఉంటారన్న ఊహాగానాలకు తెరపడినట్టు అయ్యింది.
ఈ కేసుకు సంబంధించి మరిన్ని విశ్లేషణలు కొనసాగుతున్నాయని, పాత గర్భగుడి తలుపుల నమూనాలతో పోల్చి తుది నివేదికను త్వరలోనే సమర్పిస్తామని వీఎస్ఎస్సీ అధికారులు సిట్‌కు తెలిపారు. ఈ శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తునకు స్పష్టమైన దిశానిర్దేశం లభించింది. గర్భగుడి నిర్మాణాలను మార్చకుండా, కేవలం రసాయన ప్రక్రియ ద్వారా బంగారాన్ని ఎలా దొంగిలించారు..? ఈ నేరం వెనుక ఉన్నదెవరు..? అనే కోణంలో ఇప్పుడు విచారణ జరగనుంది.