న్యూఢిల్లీ: నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. ‘కునో జాతీయ పార్క్'(కేఎన్పీ) చీతాలకు అనువుగా లేకపోవటం, మరో ఆవాసం వెతకటంలో కేంద్ర వైఫల్యం.. చీతాల వరుస మరణాలకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. కాగా, కేఎన్పీ నుంచి మరో చోటకు చీతాలను తరలించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం ప్రకటించారు. శుక్రవారం మగ చీతా సూరజ్ మృత్యువాత పడింది. కొద్ది రోజుల క్రితం మరో మగ చీతా తేజస్ చనిపోయింది. 8 చీతాలు మరణించటం పట్ల వన్యప్రాణి సంరక్షణ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎన్‌పీలో వాటి సంఖ్య 24 నుంచి 16కు పడిపోయింది. చీతాలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పులులు, చిరుతపులులతో ఘర్షణ తలెత్తి రాబోయే రోజుల్లో మరికొన్ని చీతాలు చనిపోయే అవకాశముందని దక్షిణాఫ్రికా వన్యప్రాణి సంరక్షణ నిపుణుడు విన్సెంట్ వాన్‌డర్ మిర్వె హెచ్చరించారు.
సుప్రీంకోర్టు చెప్పినా..
చీతాలను వేరే చోటకు తరలించే ఆలోచన చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అయినా కేంద్రం పట్టించు కోకపోవడం శోచనీయం.