Night Party | అహ్మదాబాద్: లేట్ నైట్ పార్టీలకు హాజరు కావద్దని, అలా వెళ్తే, రేప్ లేదా గ్యాంగ్ రేప్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ కొన్ని పోస్టర్లు అహ్మదాబాద్ నగరంలో దర్శనమిచ్చాయి. మరికొన్ని పోస్టర్లలో నిర్జన ప్రాంతాల్లోకి మీ స్నేహితునితో కలిసి వెళ్లకండి, అలా వెళ్లేవారిపై రేప్ లేదా గ్యాంగ్ రేప్ జరిగితే? అని హెచ్చరించారు. ఈ పోస్టర్లను అహ్మదాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు స్పాన్సర్ చేసినట్లు వార్తలు రావడంతో బీజేపీ పాలిత గుజరాత్‌లోని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో వీటిని తొలగించారు. దీనిపై ట్రాఫిక్ విభాగం డీసీపీ (వెస్ట్) నీతా దేశాయ్ మాట్లాడుతూ, తాము రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను మాత్రమే స్పాన్సర్ చేశామని, మహిళల భద్రతపై కాదని చెప్పారు.
ట్రాఫిక్ పోలీసుల అనుమతి లేకుండా సతర్క గ్రూప్ అనే ఎన్జీవో ఈ వివాదాస్పద పోస్టర్లను తయారు చేసిందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అనుకుంటున్నామని ఆ సంస్థ సభ్యులు తమకు చెప్పారని తెలిపారు. తమకు ట్రాఫిక్‌పై అవగాహనకు సంబంధించిన పోస్టర్లను మాత్రమే చూపించారన్నారు.
వివాదాస్పద పోస్టర్లను తమకు చూపించలేదని, తమ అనుమతి లేకుండా వాటిని అంటించారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే తొలగించామని తెలిపారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ, బీజేపీ పాలిత గుజరాత్లో మహిళా సాధికారత గురించి మాట్లాడతారని, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయని దుయ్యబట్టింది. గడచిన మూడేండ్లలో రాష్ట్రంలో 6,500 రేప్‌లు, 36 గ్యాంగ్ రేప్‌లు జరిగాయని పేర్కొంది.