అహ్మదాబాద్, జూన్ 13: అదృష్టంతోపాటు సకాలంలో వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్లే తాను ప్రాణాలతో బయటపడగలిగానని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగానిలిచిన 40 ఏండ్ల ప్రవాస భారతీయుడు, బ్రిటిష్ వ్యాపారి విశ్వాస్‌కుమార్ రమేశ్ తెలిపారు. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న రమేశ్ శుక్రవారం డీడీ న్యూస్‌తో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించారు. విమానంలోని ఎడమ వైపున ఎమర్జెన్సీ డోరుకు అత్యంత సమీపంలో నేను కూర్చున్న 11ఏ సీటు ఉంది.
గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజీ సముదాయంలో భాగమైన హాస్టల్ భవనంపై విమానం కూలిపోయింది. అదృష్టవశాత్తు నేను కూర్చున్న సీటు భాగం హాస్టల్ ప్రాంగణం గ్రౌండ్ ఫ్లోర్‌పైన పడింది. విమానం డోరు పగిలిపోవడాన్ని చూశాక ఒకసారి ప్రయత్నించి బయటపడవచ్చని అనుకున్నాను. అనుకున్న వెంటనే విమానం నుంచి బయటపడ్డాను’ అని రమేశ్ తెలిపారు.
‘నా కళ్ల ముందే అంతా క్షణాలలో జరిగిపోయింది. నేను ఎలా బతికానో నేనే నమ్మలేకపోతున్నాను. కొన్ని క్షణాలపాటు నేను చనిపోతున్నానని భావించాను. కళ్లు తెరిచి చూస్తే బతికే ఉన్నాను. సీటు బెల్టును అన్‌లాక్ చేసుకుని విరిగిపోయిన తలుపు కంతలో నుంచి బయటపడ్డాను’ అని రమేశ్ వివరించారు. విమానంలోని ఇతర ప్రయాణికులు బయటపడలేకపోవడానికి కారణం అటువైపు హాస్టల్ గోడ ఉండడమేనని ఆయన చెప్పారు.
తాను కూర్చున్న సీటు దగ్గర ఒక చిన్న కంత ఏర్పడిందని రమేశ్ తెలిపారు. తన కళ్ల ముందే అనేకమంది ప్రాణాలు కోల్పోవడాన్ని చూశానని, తాను ఎలా బతికానో ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని రమేశ్ చెప్పారు. లండన్‌కు 140 కిలోమీటర్ల దూరంలోని లీసెస్టర్ నగరంలో నివసిస్తున్న రమేశ్ సొంతూరు గుజరాత్ పొరుగున ఉన్న కోస్తా పట్టణం డయూ. చికిత్స పొందుతున్న రమేశ్‌ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ దవాఖానలో పరామర్శించారు. తాను ప్రమాదం నుంచి బయటపడినా తన ఎడమ చేయి మంటల్లో కాలిందని పేర్కొన్నారు. విమానం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చిన తాను ఎదురుగా కనిపించిన అంబులెన్సులో కూర్చుని దవాఖానకు వచ్చానని రమేశ్ తెలిపారు.