Supreme Court | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) నిక్షిప్తమైన డాటాను తొలగించొద్దని ఎన్నికల సంఘానికి (ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు ఓటమిపాలైన అభ్యర్థి ఎవరైనా ఆరోపిస్తే, ఇంజినీర్ సమక్షంలో ఆ డాటాను విశ్లేషించాల్సిందేనని పేర్కొంది. ఎన్నికలు పూర్తైన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు-ఎస్‌వోపీలు) పాటిస్తున్నారంటూ ఈసీని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), హర్యానాకు చెందిన రాజకీయ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత కూడా ఈవీఎంలలో డాటాను తొలగించకూడదని, ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురికాలేదని నిరూపించడానికి ఈవీఎంలలోని మైక్రో కంట్రోలర్, బర్న్ మెమొరీని ఇంజినీర్ల బృందం చేత తనిఖీ చేయించాలని కోరుతూ ఏడీఆర్, కొందరు హర్యానా నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను ఈసీ పాటించాలని పిటిషన్లో కోరారు.