Agnipath | సైన్యంలో నాలుగేండ్ల సర్వీసు పాలసీపై దేశవ్యాప్త నిరసన వెల్లువెత్తుతున్నది. ఈ పాలసీపై భారత ఆర్మీ రిటైర్డ్ అధికారి మేజర్ జనరల్ జీడీ బక్షి తీవ్ర విమర్శలు చేశారు. ఈ పాలసీలో పలు లోటుపాట్లు ఉన్నాయని ఎత్తి చూపారు. అగ్నిపథ్ కింద నియమితులై జవాన్లుగా పని చేసిన వారు నాలుగేండ్ల తర్వాత బయటకు వస్తే ఉగ్రవాదులతో గానీ, వేర్పాటువాద సంస్థలతో గానీ చేరే అవకాశం ఉందని, అదే జరిగితే విపత్కర ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. నాలుగేండ్ల డ్యూటీ మోడల్లో నియమితులైన వారికి సరైన శిక్షణ ఉండబోదని తెలిపారు. చైనా, పాకిస్థాన్ల నుంచి తీవ్రమైన ముప్పు ఉన్న తరుణంలో భారత సైన్యంలో సంస్థాగత అలజడి తేవొద్దని కోరారు.
చైనా ఆర్మీలో క్వాసి కాన్స్క్రిప్ట్ ఫోర్స్ మాదిరిగా అగ్నిపథ్ పేరుతో మరో బలగాన్ని రూపొందించే ప్రయత్నం అని బక్షి వ్యాఖ్యానించారు. కానీ దీన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్ స్కీం ప్రకటించిప్పుడు విసిగిపోయా. ఇది ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ అని నేను భావిస్తున్నా. చైనాలో స్వల్పకాలిక సైనిక బలగాల మాదిరిగా భారత ఆర్మీని మార్చొద్దన్నారు. అగ్ని పథ్ పథకాన్ని అమలు చేయొద్దని కేంద్రాన్ని కోరారు.
చైనా, పాకిస్థాన్ల నుంచి గొప్ప ముప్పు ఉన్నప్పుడు మన సంస్థలు, వ్యవస్థను ధ్వంసం చేయొద్దని రిటైర్డ్ మేజర్ జనరల్ బక్షి సూచించారు. సైనిక బలగాలు బాగా పని చేస్తున్నాయి. డబ్బు పొదుపు చేయడానికి మనకు అవసరమైనదాన్ని ధ్వంసం చేయొద్దు. యువతను అనుభవాన్ని సమ్మిళితం చేయాల్సిన అవసరం ఉంది. నాలుగేండ్ల సైనిక సర్వీసుతో ముప్పు పొంచి ఉంది. రష్యా నుంచి గుణపాఠం నేర్చుకోవాలి అని పేర్కొన్నారు. `అగ్నివీర్, అన్ని మిలిటరీలు సంస్థాగత సంస్కృతి, విలువలు కలిగి ఉంటాయి. భారత ఆర్మీ కూడా పూర్తిగా ఆర్మీలో సేవ చేసే సంప్రదాయం కలిగి ఉంది. నాలుగేండ్ల డ్యూటీ మోడల్ తేవడం వల్ల చాలా విఘాతం కలిగించే చర్య అని అన్నారు.