Donald Trump | న్యూఢిల్లీ, జూలై 15: రష్యన్ భూభాగంలోకి లోతుగా చొచ్చుకువెళ్లి దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ను ప్రైవేట్‌గా కోరినట్టు సమాచారం. అంతేగాక సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అందచేస్తే మాస్కోపై కూడా దాడి చేయగలరా అని కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని ట్రంప్ ప్రశ్నించారు. ఆయుధాలిస్తే అందుకు సిద్ధమేనని జెలెన్స్కీ బదులిచ్చినట్టు తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడిన మరుసటి రోజు జూలై 4న జెలెన్స్కీతో ట్రంప్ టెలిఫోన్లో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కి సరఫరా చేసే విషయాన్ని కూడా ట్రంప్ చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, పుతిన్‌తో తన సంభాషణపై ట్రంప్ సోమవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించడం పట్ల పుతిన్ ఆసక్తిగా ఉన్నట్లు కనపడడం లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కి ఆయుధాల సరఫరాను అమెరికా నిలిపివేసిన కొన్ని వారాల తర్వాత తాజా పరిణామం చోటుచేసుకుంది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూతేతో కలసి సోమవారం ఓవల్ ఆఫీసు నుంచి మాట్లాడిన ట్రంప్ నాటో మిత్ర దేశాలకు త్వరలో వందల కోట్ల డాలర్ల విలువైన అమెరికా తయారీ ఆయుధాలను పంపనున్నట్లు ధ్రువీకరించారు. తాము అత్యంత అధునాతన ఆయుధాలను తయారుచేయనున్నామని, అవి నాటోకు వెళతాయని ట్రంప్ విలేకరులకు తెలిపారు.
యుద్ధం ఆపకుంటే భారీ సుంకాలు
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించాలని రష్యాపై ఒత్తిడి పెడుతున్న ట్రంప్ వచ్చే 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి రాకపోతే కఠినమైన సుంకాలను ఎదుర్కోవలసి వస్తుందని పుతిన్‌ని హెచ్చరించారు. 50 రోజుల్లో ఒప్పందం జరగకపోతే రష్యాపై అదనంగా 100 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. తమకు అత్యవసరంగా రెండు పాట్రియట్ గగనతల రక్షణ వ్యవస్థలు కావాలని ఉక్రెయిన్ కోరుతుండగా క్షిపణి బ్యాటరీలతోసహా పూర్తి ప్యాకేజీని ఉక్రెయిన్‌కి పంపడానికి అమెరికా సన్నాహాలు చేస్తోంది.
ఆంక్షలు ఎదుర్కొనడానికి సిద్ధం: రష్యా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మంగళవారం స్పందించారు. కొత్త ఆంక్షలను ఎదుర్కొనడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అటువంటి హెచ్చరికలు చేయడం వెనుక ట్రంప్ ఉద్దేశం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.