భారత్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్షగట్టినట్టే కనిపిస్తున్నది. గురువారం ఒక్కరోజే మూడు విషయాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. వాణిజ్యం కావాలా? వద్దా? అని బెదిరించి భారత్, పాక్‌లను కాల్పుల విరమణపై అంగీకరించేలా చేశానని ప్రకటించుకున్న ట్రంప్.. తాను చెప్తున్న ‘వాణిజ్యం’ ఏమిటో మెల్లమెల్లగా వెల్లడిస్తున్నాడు.
అమెరికా ఉత్పత్తులపై జీరో టారిఫ్‌కు భారత్ అంగీకరించిందంటూ ట్రంప్ గురువారం మరో బాంబు పేల్చాడు. దీంతో ‘అబ్బే.. అలాంటిదేమీ ఇంకా ఖరారు కాలేదు’ అని జైశంకర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా భారత్ నుంచి బయటపడాలని ఆపిల్ సీఈవో టిమ్‌కుక్‌కు ట్రంప్ నేరుగానే సూచించారు. అన్నింటికి మించి.. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా పాక్‌కు అన్ని విధాలా సాయపడి భారత ప్రజల తీవ్ర ఆగ్రహానికి కారణమైన తుర్కియేకు అమెరికా మద్దతుగా నిలిచింది. తుర్కియేకు క్షిపణులు విక్రయించేందుకు ట్రంప్ ఒప్పందం చేసుకోవడం అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నది.
Donald Trump | న్యూఢిల్లీ, మే 15: భారత్ మీద అమెరికా కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. ఆ దేశ అధ్యక్షుడి నిర్ణయాలను గమనిస్తే ఇదే అనుమానం కలుగుతుంది. వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించి భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించినట్టు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజాగా భారత్‌లో యాపిల్ తయారీ ప్లాంట్‌పై ఆయన అక్కసు వెళ్లగక్కారు. యాపిల్ కంపెనీ భారత్‌లో ఐఫోన్లు తయారు చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొంటూ.. దేశంలో ఉత్పత్తి కేంద్రాలను విస్తరించకుండా యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌పై ఒత్తిళ్లు తెచ్చారు. అలాగే భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు ఆయుధాలు అందించిన తుర్కియేకు క్షిపణులను విక్రయించేందుకు తాజాగా అమెరికా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని రోజులకే పాకిస్థాన్‌తో ట్రంప్ కుటుంబ సంస్థ ఒకటి భారీ క్రిప్టో కరెన్సీ డీల్ కుదుర్చుకోవడం గమనార్హం.
యాపిల్ కంపెనీ తన ఉత్పత్తి కేంద్రాలను భారత్‌లో విస్తరించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న ట్రంప్ దోహాలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్‌తో తనకు చిన్న సమస్య ఎదురైందని అన్నారు. యాపిల్ కంపెనీ ఇండియాలో ఐఫోన్లను ఉత్పత్తి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ‘నేను కుక్‌తో ఇలా చెప్పాను.. మై ఫ్రెండ్ నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను. నీవు 500 బిలియన్ డాలర్లతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నావు. నువ్వు ఇండియా అంతటా యూనిట్లు ఏర్పాట్లు చేస్తున్నావని విన్నాను. నువ్వు ఇండియాలో ఉత్పత్తి చేయడం నాకు ఇష్టం లేదు. ఇండియా పట్ల నీకు శ్రద్ధ ఉంటే నువ్వు అక్కడే నీ ఉత్పత్తులు తయారు చేసుకో. కానీ ప్రపంచంలో అత్యధికంగా పన్నులు వేస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి, అక్కడ నీ ఉత్పత్తులు అమ్ముకోవడం చాలా కష్టం అని చెప్పాను. చైనాలో ప్లాంట్లు నిర్మించినా ఎన్నో సంవత్సరాలుగా సహిస్తున్నాం. మీరు ఇండియాలో ప్లాంట్లు ఏర్పాటుచేయడంపై మాకు ఆసక్తి లేదు. ఇండియా దాని సంగతి అది చూసుకోగలదు అని చెప్పాను’ అని వివరించారు. కుక్‌తో తన సంభాషణ అనంతరం యాపిల్ కంపెనీ అమెరికాలో తన ఉత్పత్తిని మరింత పెంచుతుందని ట్రంప్ చెప్పారు.
పాకిస్థాన్‌తో అంటకాగుతున్న తుర్కియేతో అమెరికా భారీ ఆయుధ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. గగనతలం నుంచి గగనతలం లక్ష్యాల్ని ఛేదించే ‘ఏఐఎం-120సీ’ క్షిపణులను తుర్కియేకి అమ్మేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో, పాక్‌కు మద్దతు పలుకుతున్న తుర్కియేకి అమెరికా నుంచి పెద్ద ఎత్తున క్షిపణులు అందటం గమనార్హం. తుర్కియేతో దాదాపు 225 మిలియన్ డాలర్ల (రూ.1,923 కోట్లు) విలువైన ‘ఫారెన్ మిలిటరీ సేల్స్’ ఒప్పందాన్ని ఆమోదించాలని అమెరికా హోం శాఖ నిర్ణయించింది.
ట్రంప్ కుటుంబ సభ్యులకు 60% వాటా ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్(డబ్ల్యూల్ఎఫ్)తో పాక్ భారీ క్రిప్టోకరెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని రోజులకే పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్), డబ్ల్యూఎల్ఎఫ్ మధ్య ఒప్పందం జరిగింది. క్రిప్టో పరిశ్రమలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ డీల్ కుదిరింది.
రెండు అణ్వస్త్ర దేశాలైన భారత్, పాక్ మధ్య గత వారం సైనిక ఘర్షణ తలెత్తినపుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధించడంలో తన ప్రత్యక్ష మధ్యవర్తిత్వం ఉన్నట్లు ఇప్పటివరకు ప్రకటిస్తూ వచ్చిన ట్రంప్ గురువారం మాటమార్చారు. ఖతార్‌లోని అల్-ఉదీద్ ఎయిర్ బేస్ వద్ద అమెరికా సైనిక బలగాలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ ‘అంతా నేనే చేశానని చెప్పను. అయితే నా సాయం మాత్రం కచ్చితంగా ఉందని చెప్పగలను’ అని వ్యాఖ్యానించారు. ‘దాదాపు వెయ్యేండ్ల నుంచి ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉందని నాకు కొందరు చెప్పారు. నేను దాన్ని పరిష్కరించగలను. ముందుగా అందరినీ ఒక చోటుకు తీసుకురానివ్వండి’ అని చెప్పిన ట్రంప్ వెంటనే మాట మారుస్తూ ‘పరిస్థితి జటిలమైనది. పరిష్కరించగలనని కచ్చితంగా చెప్పలేను. అది చాలా కష్టమైన పని’ అని వెల్లడించారు.
అమెరికా ఉత్పత్తులపై భారత్ అన్ని రకాల టారిఫ్‌లను ఎత్తివేస్తామని ప్రకటించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సంచలన ప్రకటన చేశారు. భారత్ తమకు ఒక ఆఫర్ ఇచ్చిందని, టారిఫ్‌లను ఎత్తివేసేందుకు అంగీకరించిందని తెలిపారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని, కానీ ఇంకా దేనిపైనా నిర్ణయం జరుగలేదని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ట్రంప్ వివిధ దేశాలతో టారిఫ్‌ల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టారిఫ్‌లను ‘శూన్యం’ స్థాయికి తగ్గించి వేసేందుకు భారత్ అంగీకరించిందని ఈ నెలారంభంలో కూడా ట్రంప్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని గత నెలలో చెప్పారు. చర్చలు గొప్పగా జరుగుతున్నాయని, త్వరలో భారత్‌తో ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై జైశంకర్ స్పందిస్తూ.. భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఇవి ఎంతో సంక్లిష్టమైనవని పేర్కొన్నారు. చర్చలు పూర్తయ్యే వరకూ ఏదీ నిర్ణయమైనట్టు కాదని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన అనేక ఉత్పత్తులపై భారత్ ‘జీరో టారిఫ్’కు అంగీకరించిందన్న ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ క్రెడిట్ దక్కించుకోవడానికి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు నాలుగైదు సార్లు బహిరంగంగా ప్రకటించుకోగా, దానికి వైట్‌హౌజ్ కూడా విస్తృత ప్రచారం చేస్తున్నది. తాను దోహాకు వెళ్లినప్పుడు బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఓ వెయిటర్ తనను కలిశాడని, యుద్ధం ఆపినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలని తనను కోరాడని శ్వేత సౌధ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలని తాను ప్రశ్నించగా.. ‘మేడం, మాది కశ్మీర్, ఇటీవల రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల సొంత ఊరికి వెళ్లలేకపోతున్నాను. యుద్ధం ముగింపునకు ట్రంప్ సార్ చేసిన మేలు మరువలేనిది. సార్‌కు నా కృతజ్ఞతలు చెప్పండి’ అని కోరాడని కరోలిన్ ఎక్స్‌లో చెప్పారు.