న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతికి తాను సంపూర్ణ అర్హుడినని ఎప్పటి నుంచో ప్రకటించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ బహుమతి తనకు కాకుండా వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను వరించడం పట్ల అనూహ్యంగా సంతృప్తి వ్యక్తం చేశారు. నోబెల్ శాంతి బహుమతి చేజారిపోవడంపై ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతారని భావించిన జర్నలిస్టులకు శనివారం వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఎప్పటిలాగే ఉల్లాసంగా కనిపించారు.
వెనెజువెలాలో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న మచాడో శాంతి బహుమతిని తన(ట్రంప్) గౌరవార్థం తీసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్న వ్యక్తి ఈ రోజు నాకు ఫోన్ చేసి ఈ బహుమతికి మీరే అర్హులు కాబట్టి నేను దీన్ని మీ గౌరవార్థం అంగీకరిస్తున్నానని చెప్పారు. ఇది చాలా మంచి విషయం అని ట్రంప్ వెల్లడించారు. ఆ బహుమతి నాకు ఇచ్చెయ్యమని ఆమెను నేను అడగలేదు..అడిగితే ఇచ్చేసి ఉండేదేమో. ఆమె చాలా మంచిది అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో విలేకరులు పగలబడి నవ్వారు.