న్యూఢిల్లీ: ఇంట్లో పనిమనిషి(Domestic Help)గా చేరిన ఓ వ్యక్తి 40 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో ఉన్న పంజాబీ బాగ్ ఏరియాలో జరిగింది. తండ్రిని చూసుకునేందుకు పనిమనిషిని ఇంట్లో పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. అయితే పనిలో చేరిన 15 రోజులకే అతను చోరీకి పాల్పడ్డాడు. నవంబర్ 29వ తేదీన ఈ ఘటనకు చెందిన ఫిర్యాదు నమోదు అయ్యింది. బీఎన్ఎస్ చట్టం కింద కేసు రిజిస్టర్ చేశారు.
సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసర ప్రాంతాలను విశ్లేషించారు. ద్రువ్ అనే వ్యక్తి ఇంట్లో నుంచి ఖాళీ చేతులతో వెళ్తున్న దృశ్యాలు తొలుత కనిపించాయి. కానీ మరో ప్రాంతంలో అతను తన మిత్రులు జతిన్, శివమ్‌తో కలిసి తిరగడం కనిపించింది. శివన్ అనే వ్యక్తి బ్లాక్ కలర్ బ్యాగు తీసుకెళ్తున్నట్లు ఓ క్లిప్‌లో గుర్తించారు.
ఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులు తమ ఫోన్లను స్విచాఫ్ చేశారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వారి కోసం పోలీసులు గాలించారు. ఆరంభంలో వాళ్ల ఆనవాళ్లను గుర్తించలేకపోయారు. ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించారు. అయితే వాళ్లు ఢిల్లీ దాటి వెళ్లినట్లు తేల్చారు. జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ద్రువ్, జతిన్ కోర్టులో సరెండర్ అయ్యారు. శివమ్ అనే వ్యక్తి క్యాబ్‌లో హిమాచల్ ప్రదేశ్ వెళ్లినట్లు తేల్చారు. క్యాబ్ డ్రైవర్ సమాచారం ఆధారంగా శివమ్ ఉన్న లొకేషన్‌ను గుర్తించారు. శివమ్ ఉంటున్న హోటల్ చేరుకున్న పోలీసులు అతన్ని బంధించారు. హోటల్ నుంచి 36 లక్షల నగుదు స్వాధీనం చేసుకున్నారు. ఎత్తుకెళ్లిన సొమ్ముతో బ్రాండెడ్ షూలు, బట్టలను కొన్నట్లు గుర్తించారు.