న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానాల రద్దు ఆరో రోజైన ఆదివారం కూడా కొనసాగింది. తాజాగా 650 విమానాలు రద్దు చేయగా, మొత్తం 2,300 విమానాలకు 1,650 నడిపినట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 10వ తేదీ నాటికి రాకపోకలను స్థిరీకరిస్తామని పేర్కొంది. రద్దయిన విమానాల్లో ఢిల్లీ, ముంబైకి చెందినవే 220 ఉన్నాయి. ముంబైలో 112, ఢిల్లీలో 109 విమానాలు రద్దయినట్టు అధికారులు తెలిపారు. విమానాల రాకపోకలను సాధారణ స్థితికి తేవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని తెలిపింది. వందలాది విమానాల రద్దు, ఆలస్యంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేలాది మంది ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాయడం కన్పించింది. తమ విమానాలు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. తాము వివరాలు అడిగినా ఇండిగో సిబ్బంది పూర్తి సమాచారం అందజేయడం లేదని, వారి స్పందన చూసి విసిగివేసారిపోయామని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
నివేదిక రాగానే సంస్థపై చర్యలు
ఇండిగో మొత్తం 2,300 విమానాల్లో శుక్రవారం 1,600 రద్దు కాగా, ఆదివారం వాటి సంఖ్య 800కు తగ్గింది. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన ఇండిగో 24 గంటల్లోగా వివరాలు ఇవ్వాలంటూ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్, సీవోవోలకు డీజేసీఏ నోటీసులు పంపగా, వాటిని వారు శనివారం అందుకున్నారు. ఇప్పటికే ఇండిగోపై విచారణ కమిటీ వేసిన కేంద్రం దాని నివేదిక రాగానే సంస్థపై చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. కాగా, వరుస రోజులుగా విమానాలు రద్దయిన క్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కే రాంమోహన్ నాయుడు, సీనియర్ అధికారులు కలిసి ఇండిగో సీఈవో ఎల్బర్స్‌తో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, డీజీసీఏ చీఫ్ ఫయీజ్ అహ్మద్ కిడ్వాయి తదితరులు హాజరయ్యారు.
సాధారణ స్థితికి తేవడానికే తొలి ప్రాధాన్యం
విమాన సర్వీసులను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం, టికెట్లకు తక్షణ రీఫండ్ల చెల్లింపు తమ తొలి ప్రాథామ్యాలని పౌర విమానయాన అధికారులు కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం తెలిపారు. అయితే ఇండిగోపై కఠిన చర్యలతో పాటు భారీ జరిమానా కూడా విధించడం ఖాయమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. తమ విమానయాన నెట్‌వర్క్‌ను దాదాపు పునరుద్ధరిస్తున్నట్టు ఇండిగో తెలిపింది. తమ సంస్థ 138 గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తుండగా, అందులో 135 గమ్యస్థానాలకు సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఇండిగో తెలిపింది. 95 శాతం మేర రూట్లు రీకనెక్ట్ అయ్యాయని వివరించింది. ప్రస్తుతం ఇండిగో నడిపే పైలట్ల సంఖ్య 700 ఉండగా, వాటిని 1500కు పెంచి ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.
ప్రయాణికులకు రూ.610 కోట్ల రీఫండ్
విమానాలను రద్దు చేసి తీవ్ర గందరగోళం సృష్టించిన ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణికుల టికెట్ల చార్జీ రీఫండ్‌ను ప్రారంభించింది. విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్రయాణికుల టికెట్ చార్జీలను రీఫండ్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. అయితే రీఫండ్ సందర్భంగా ఎలాంటి అదనపు చార్జీ వసూలు చేయరాదని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడమే కాక, కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. ఇప్పటివరకు ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లను రీఫండ్ ఇచ్చిందని, అలాగే దేశ వ్యాప్తంగా 3,000 లగేజీలను వారికి అందజేసిందని పౌర విమానయాన శాఖ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్ ఆన్‌టైమ్ పనితీరు 75 శాతానికి చేరుకుందని, విమానాల రద్దు ప్రయాణికులు అనవసరంగా విమానాశ్రయానికి రాకుండా నిరోధించడంలో సహాయపడ్డాయని సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. డిసెంబర్ 10వ తేదీ నాటికి సర్వీసులు పూర్తిగా చక్కబడతాయని భావిస్తున్నట్టు చెప్పారు.