పనాజీ: గోవాలోని లైరా దేవి ఆలయ జాతర(Lairai Devi Jatra)లో జరిగిన తొక్కిసలాటలో ఆరు మంది మృతిచెందారు. మరో 50 మంది గాయపడ్డారు. శిర్గావ్లోని ఆ ఆలయంలో ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. శనివారం తెల్లవారుజామున… సుమారు 4 నుంచి 4.30 నిమిషాల మధ్య ఆలయంలో భక్తులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు తోసుకున్నారు. అర్థరాత్రి అగ్నిదివ్య అనే కార్యక్రమం జరిగిన తర్వాత తొక్కిసలాట చోటుచేసుకున్నది.
జాతరలో భాగంగా ఆలయ సమీపంలోని అగ్నిగుండం చుట్టూ భక్తులు తిరుగుతూ తమ కోర్కెల్ని చెప్పుకుంటారు. అగ్ని దివ్య చుట్టు తిరగడం ఇక్కడ సంప్రదాయం. ఇక కొందరు ఆ నిప్పుల కుప్ప మీద నడుస్తారు కూడా. అయితే తొక్కిసలాట జరిగిన సమయంలో.. భక్తలు అక్కడే ఉన్నారా లేదో స్పష్టంగా తెలియదు. కానీ జనం కిక్కిరిసిపోవడం వల్ల తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
VIDEO | Visuals from Sree Lairai Devi temple in Shirgao village where a stampede broke out during a temple festival in North Goa in the wee hours of Saturday.
(Source: Third Party)#Goa #GoaStampede pic.twitter.com/qtCn4ReIMb
— Press Trust of India (@PTI_News) May 3, 2025
తొక్కిసలాట సమయంలో భక్తులు ఒకర్ని ఒకరు తొసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. జనాన్ని నియంత్రించే వ్యవస్థ లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నారు. బహుశా ఎలక్ట్రిక్ షాక్ వల్ల జనం తొక్కిసలాటకు గురై ఉంటారని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. కానీ సీఎం వ్యాఖ్యలకు ఎటువంటి నిర్ధారణ జరగలేదు. పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి గాయపడ్డవారిని గోవా మెడికల్ కాలేజీ, నార్త్ గోవా జిల్లా ఆస్పత్రికి తరలించారు.
గోవాలో లైరా దేవి జాతర చాలా ఫేమస్. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో లైరా దేవి జాతర నిర్వహిస్తారు. పార్వతీదేవికి ప్రతిరూపంగా లైరాదేవిని కొలుస్తారు. గోవా జానపద సంస్కృతిలో ఏడుగురు అక్కాచెళ్లెల్లలో లైరా దేవి ఒకరు. ఈ జాతరలో పాల్గొనేందుకు గోవాతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.