BBC Documentary | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): భారత్లో నిషేధానికి గురైన బీబీసీ డాక్యుమెంటరీని ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని పార్లమెంట్ హౌస్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో ప్రధాని మోదీ బుధవారం సమావేశమయ్యారు. మోదీ పర్యటన ఉందని తెలిసే.. అక్కడి చట్టసభ సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తలు బుధవారం సాయంత్రం ‘బీబీసీ డాక్యుమెంటరీ’ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే, డాక్యుమెంటరీ ప్రదర్శన సమయాని కంటే ముందే మోదీ ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని స్వదేశానికి ప్రయాణమవ్వడం గమనార్హం. కాగా, డాక్యుమెంటరీ ప్రదర్శన పూర్తయిన తర్వాత చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సంవాదంలో ఆస్ట్రేలియా గ్రీన్స్ పార్టీ నేతలు వెస్టర్న్ ఆస్ట్రేలియా సెనేటర్ జోర్డాన్ స్టీల్-జాన్, న్యూ సౌత్ వేల్స్ సెనేటర్ డేవిడ్ షోబ్రిడ్జ్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కుమార్తె ఆకాశీ భట్, సౌత్ ఏషియన్ సాలిడరిటీ గ్రూప్ సభ్యురాలు కల్పనా విల్సన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్యుమెంటరీ ప్రదర్శన పూర్తయిన అనంతరం డేవిడ్ షో బ్రిడ్జ్ మాట్లాడుతూ.. భారత్లో నిజం చెప్తే నేరమని అభిప్రాయపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పౌరులు దుర్దినాలు గడుపుతున్నట్టు మండిపడ్డారు. ‘భారత్లో స్వేచ్ఛగా మాట్లాడటమే కష్టమని నాకు చాలామంది చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని చూసి భారత్లో ఉన్న ఆస్ట్రేలియన్లు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీలో చూపించింది కేవలం కొంతేనని, కొన్ని నెలలపాటు గుజరాత్ తగలబడిపోయిందని, కనికరంలేకుండా ముస్లింలపై దాడులు జరిగాయని ఆకాశీ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూత్వమనేది భారత ప్రజాస్వామ్యానికి ముప్పు తలపెట్టేలా మారిందని, దీనికి పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉన్నదని మస్సే యూనివర్సిటీ ప్రొఫెసర్ మోహన్ దత్ అభిప్రాయపడ్డారు.
2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో మోదీ పాత్రపై అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఫిబ్రవరిలో విడుదల చేసిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించింది. ఇంతలో ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. భారత్లో బీబీసీ కోసం పనిచేసే విదేశీ పాత్రికేయుల వీసాలను పొడిగించకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నది.
భారత్లో నిజం చెప్తే నేరం. అక్కడి ప్రభుత్వపాలనలో భారతీయులకు రోజూ దుర్దినాలే. దీనికి బీబీసీ డాక్యుమెంటరీ ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకా తెలియాల్సింది చాలానే ఉంది.
-బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా గ్రీన్స్ సెనేటర్ డేవిడ్ షోబ్రిడ్జ్