న్యూఢిల్లీ, ఆగస్టు 10: విధి నిర్వహణలో ఉండగా రోగులు లేదా వారి బంధువులు అనుచితంగా, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వారికి వైద్యం నిరాకరించడానికి వైద్యులకు అనుమతి ఇస్తున్నట్టు జాతీయ మెడికల్ కౌన్సిల్ తెలిపింది. విధి నిర్వహణలో డాక్టర్లపై ఇటీవల కాలంలో రోగులు, వారి బంధువులు దాడులు, దుర్భాషలకు పాల్పడుతున్న క్రమంలో దీని నివారణకు ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే వృత్తిపర ప్రవర్తనా నియమావళి ప్రకారం డాక్టర్లు ఏ ఔషధ బ్రాండ్, మందు, పరికరాలకు ప్రచారం చేయరాదని ఆంక్షలు విధించింది. ఈ మేరకు ఎన్ఎంసీ ఈ నెల 2న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఆర్ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు మందుల కంపెనీలు, వాటి ప్రతినిధులు, కార్పొరేట్, ఇతర దవాఖానల నుంచి ఎలాంటి బహుమతులు, ఉచిత ప్రయాణాలు, నగదు, ఇతర ప్రయోజనాలేవీ స్వీకరించరాదంటూ నిబంధనలు విధించింది.