Kerala : కేరళలో కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన ఒక గర్భిణికి ఊహించని పరిస్థితి ఎదురైంది. బిడ్డ గురించి ఎన్నో కలలు కన్న ఆమెకు శిశువు గర్భంలోనే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాంతో, కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు డాక్టర్లపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందని వాళ్లు ఆరోపించారు. ఈ సంఘటనలో ఒక డాక్టర్, ఆస్పత్రి పీఆర్ఓ, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. దాంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనలో గర్భణి భర్తతో పాటు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కేరళలోని మవట్టుపుజా పెఝాకపిల్లి సబినే అనే ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం 2ః30 గంటలకు ఈ సంఘటన జరిగింది. పెఘాకపల్లికి చెందిన గర్భిణి నెలలు నిండడంతో దవాఖానలో చేరింది. అయితే.. కొంచెం సేపటికే బిడ్డ కడుపులోనే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దాంతో, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందని ఆమె తరఫు బంధువులు ఆందోళనకు దిగారు. కోపంతో ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారు.