న్యూఢిల్లీ: డాక్టర్-జనాభా నిష్పత్తి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల కన్నా మన దేశంలో మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం లోక్సభకు తెలిపారు. ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలని డబ్ల్యూహెచ్ఓ చెప్పిందని, మన దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని ఆయన చెప్పారు.
రాష్ట్ర వైద్య మండళ్లు, జాతీయ వైద్య కమిషన్ వద్ద ఈ ఏడాది నవంబర్ నాటికి 13,86,145 మంది అల్లోపతిక్ వైద్యులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వైద్య కళాశాలల సంఖ్యను పెంచామని, 2014కు ముందు 51,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని, ఇప్పుడు 1,18,137కు పెరిగాయన్నారు.