న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు (Delhi Blast Case) సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) అని తేలింది. కారులో లభించిన నమూనాలతో అతని డీఎన్ఏ (DNA) సరిపోలడంతో కారు నడిపింది నబీయేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
గత సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న అతను కూడా ప్రాణాలు కోల్పోయాడని అధికారులు అనుమానించారు. ఈ నేపథ్యంలో పుల్వామాలో ఉన్న అతని తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకొని పరీక్షించారు. కారు స్టీరింగ్, యాక్సిలరేటర్ మధ్య ఇరుక్కున్న కాలు నుంచి సేకరించి డీఎన్ఏను ఆమె డీఎన్ఏతో సరిపోల్చారు. దీంతో కారులో లభించిన డీఎన్ఏ ఉమర్ నబీదేనని తేలినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
రిపబ్లిక్ డే నాడు దాడికి పథకం
ఈ ఏడాది జనవరిలో ఎర్ర కోట వద్ద డాక్టర్ ముజమ్మిల్ పలుసార్లు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోటపై దాడి చేసేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో భాగంగానే ఈ రెక్కీ జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడ పటిష్టమైన పోలీసు పెట్రోలింగ్ ఉండడంతో వారి కుట్ర భగ్నమైందని చెప్పారు.
డిసెంబర్ 6న భారీ పేలుడుకు ప్లాన్
బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న భారీ పేలుడుకు రెడ్ ఫోర్ట్ సమీపంలో పేలుడుకు గురైన కారును నడుపుతున్న డాక్టర్ ఉమర్ నబీ కుట్ర పన్నినట్లు బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్రాష్ట్ర వైట్ కాలర్ జైషే మొహమ్మద్ ఉగ్ర మాడ్యుల్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపై అరెస్టయిన 8 మందిని పోలీసులు ప్రశ్నించగా ఈ సంచలన వివరాలు వెల్లడైనట్లు ఆ వర్గాలు చెప్పాయి.
ఉగ్ర కుట్ర కేంద్రంగా అల్ ఫలాహ్ వర్సిటీ!
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు ఉగ్ర కుట్రలో భాగం కావడంతో దర్యాప్తు సంస్థల దృష్టి ఈ వర్సిటీపై పడింది. ఫరీదాబాద్ పరిధిలోని ధౌజ్ గ్రామంలో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సంస్థ హర్యానా రాజధానికి కేవలం 30 కి.మీ దూరంలోనే ఉంది. వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్‌కు, రాడికలైజ్డ్ నిపుణుల బృందం తలపెట్టిన ఒక మారణహోమానికి కేంద్ర బిందువుగా మారింది. పోలీసులు, ఇతర దర్యాప్తు బృందాలు పలువురు సిబ్బందిని ప్రశ్నించారు.
మరో డాక్టర్ మిస్సింగ్
డాక్టర్ ఉమర్ కాకుండా, ఉగ్ర దాడికి సహకరించారని అనుమానిస్తున్న, జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న అతని ఇద్దరు సహాయకులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహిన్ షాహిద్లు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. డాక్టర్ షకీల్‌ను అరెస్ట్ చేయడంతో తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఉమర్ సోమవారం కారు బాంబు పేలుడుకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. డాక్టర్ షాహిన్ కారు నుంచి రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని యూనివర్సిటీ నుంచి అరెస్ట్ చేశారు. పేలుడు అనంతరం మరో డాక్టర్ నిసర్-ఉల్-హసన్ పరారీలో ఉన్నాడు. హసన్ ప్రస్తుతం ఈ యూనివర్సిటీలో మెడిసిన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణపై ఆయనను శ్రీ మహరాజ హరి సింగ్ హాస్పిటల్ నుంచి జమ్ము కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ విధుల నుంచి తొలగించారు. అయితే ఇలాంటి రికార్డు ఉన్న వ్యక్తిని ఈ యూనివర్సిటీలో ఎలా నియమించారన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.