చెన్నై, జూన్ 28: ఇతర భాషలలో దేనికీ హిందీ శత్రువు కాదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ కనిమొళి కౌంటర్ ఇచ్చారు. తమిళం కూడా ఏ భాషకు శత్రువు కాదని, అందుకే ఉత్తరాది ప్రజలు తమిళం నేర్చుకోవాలని శనివారం కనిమొళి కోరారు. ఇటీవల అమిత్ షా హిందీ ఏ ఇతర భారతీయ భాషకు శత్రువు కాదని, పైపెచ్చు ఇతర అన్ని భాషలకు మిత్రురాలని చెప్పారు. దీనిపై కనిమొళి స్పందిస్తూ ‘ఏ భాషకు హిందీ శత్రువు కానప్పుడు తమిళం కూడా ఏ భాషకు శత్రువు కాదు. ముందు వారిని(ఉత్తరాది ప్రజ లు) తమిళం నేర్చుకోనివ్వండి. ఉత్తర భారత ప్రజలు దక్షిణ భారతీయ భాషల్లో కనీసం ఒక్కటైనా నేర్చుకోమనండి. అదే నిజమైన జాతీయ సమగ్రత అవుతుంది’ అని చెప్పారు. తాము ఎవరికీ శత్రువులం కామని, అందరికీ తాము మిత్రులమేనని తెలిపారు. తమ భాషను ఇతరులు కూడా నేర్చుకోవాలి అని అన్నారు.