చెన్నై: డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత ఏ రాజా(A Raja) .. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలకు ఆయన ఇటీవల ఓ ఆదేశం జారీ చేశారు. కుంకుమ బొట్టు పెట్టుకోవద్దు అని, చేతికి కంకణం కట్టుకోవద్దు అని పార్టీ కార్యకర్తలను కోరారు. పార్టీ ధోతీ కట్టుకున్న సమయంలో.. బొట్టు, కంకణం ధరించవద్దు అన్నారు. ఒకవేళ అలా గెటప్‌లో ఉంటే, అన్నాడీఎంకే తరహాలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రెండు రోజుల క్రితం నీలగిరి జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
దేవుడి నమ్మకాలకు తానేమీ వ్యతిరేకం కాదు అని, పేద ప్రజల చిరునవ్వులోనే దేవుడు ఉన్నాడని తమ పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పేర్కొన్న విషయాన్ని మరిచిపోలేమని, కానీ కుంకుమ బొట్టు పెట్టుకుని, కంకణం కట్టుకుంటే ఆర్ఎస్ఎస్ సభ్యుల్లా ఉంటామని, సంఘీ కార్యకర్తలతో తేడాను గుర్తించడం కష్టంగా ఉంటుందని డీఎంకే నేత ఏ రాజా పేర్కొన్నారు. కనీసం స్టూడెంట్ వింగ్‌కు చెందిన కార్యకర్తలు బొట్టు పెట్టుకోవద్దు అని తెలిపారు. కానీ తానేమీ దేవుడిని ఆరాధించవద్దు అని చెప్పడం లేదన్నారు. ఒకవేళ పేరెంట్స్ విభూతి పెడితే దాన్ని అంగీకరించాలన్నారు. నుదిటిపై పెద్దలు విభూతి పెట్టే సాంప్రదాయాన్ని తమిళులు దీవెనగా భావిస్తుంటారు.
డీఎంకే పార్టీతో అనుసంధానమైన ధోతిని ధరించిన సమయంలో మాత్రం కుంకుమ పెట్టుకోవద్దు అని రాజా స్పష్టం చేశారు. ఎటువంటి ఐడియాలజీ లేని రాజకీయ పార్టీ నాశనం అవుతుందని, దానికి ఉదాహరణ అన్నాడీఎంకే అని తెలిపారు. రాజా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు స్పందించారు. రాజా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని, పార్టీ నేత ఎంకే స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. గతంలోనూ ఏ రాజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో పోల్చారు.
మత విశ్వాసాలను కించపరచడం ఆపేయాలని డీఎంకే రాజాను తమిళనాడు బీజేపీ పార్టీ కోరింది. హిందూ మతాన్ని రాజా చిన్నచూపు చూస్తున్నట్లు ఆరోపించింది. తిలకం పెట్టుకోవద్దు అని విద్యార్థి సంఘానికి సూచించడం సరికాదు అని బీజేపీ తెలిపింది. మతసామరస్యం గురించి మాట్లాడే డీఎంకే పార్టీ హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తుందని బీజేపీ ప్రశ్నించింది.