న్యూఢిల్లీ, మే 26 : కర్ణాటకలో నాయకత్వ రగడ నాటకీయ మలుపు తీసుకున్నది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేయనున్నారు. బుధవారం బెంగళూరులో ఆయన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ ద్వారా ఢిల్లీకి మకాం మార్చాలని సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో ఆయనకు మరింత పెద్ద పాత్ర ఇస్తామని హామీ ఇచ్చింది. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో మార్పులు తీసుకురావడం, పార్టీని, ప్రభుత్వాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రికి తెలియచేసినట్లు తెలిసింది.
అధికార బదిలీ సున్నితంగా, గౌరవప్రదంగా జరుగాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనపై సంపూర్ణంగా ఆలోచించడానికి పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రికి సమయం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్లు పార్టీ నాయకత్వం నుండి స్పష్టమైన సంకేతం వెలువడినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చాలా కాలంగా తెరవెనుక వేచి చూస్తున్నారు. ఢిల్లీలో మంగళవారం ఆరుగంటలకు పైగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కర్ణాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహిరంగంగా తోసిపుచ్చిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతేగాకుండా నేటి చర్చలు రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యాయని కూడా వారు స్పష్టం చేశారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ఢిల్లీలో పెద్ద సంస్థాగత లేదా పరిపాలనా పాత్రను చేపట్టవచ్చని కాంగ్రెస్ నాయకత్వం సిద్ధరామయ్యకు తెలియచేసింది.
మిగతా అన్ని విషయాలు, అన్ని సమస్యలు చూసుకుంటాం అని కూడా అధిష్ఠానం ఆయనకు హామీ ఇచ్చిందని కూడా వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాయకత్వ మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతుండగా కాంగ్రెస్ అధికారికంగా సిద్ధరామయ్య మార్పుపై ఎటువంటి చర్చ జరగలేదని ప్రకటించడం గమనార్హం. దాదాపు ఆరు గంటలకు పైగా జరిగిన చర్చల అనంతరం కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ తమ చర్చలు రాజ్యసభ, కర్ణాటక శాసన మండలి ఎన్నికలకు మాత్రమే పరిమితమైనట్లు స్పష్టం చేశారు. నేటి చర్చలు కేవలం రాజ్యసభ ఎన్నికలు, ఎంఎల్సీ ఎన్నికల చుట్టూ మాత్రమే జరిగాయి. మీరు ఊహించినది నిజంకాదు అని వేణుగోపాల్ చెప్పారు.
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో అంతర్గత కలహాలు లేదా నాయకత్వ మార్పు డిమాండ్లపై తరచుగా వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులైన పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఎట్టకేలకు ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్యను తప్పించడానికి రంగం సిద్ధమైంది. కాగా బీహార్ తరహా వ్యూహాన్ని కర్ణాటకలో కూడా అమలు చేసే అవకాశం కనపడుతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపడం, ఆయన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం వంటి ప్రతిపాదనలను కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నది. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే కొన్ని వారాల క్రితం బీహార్‌లో ఏం జరిగిందో అటువంటి పరిస్థితే ఇక్కడా ఏర్పడవచ్చు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్‌కు ఇటీవల రాజ్యసభలో స్థానం కల్పించిన బీజేపీ ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమ్రాట్ చౌధురిని ముఖ్యమంత్రిగా నియమించింది. నితీశ్ కుమారుడు నిషాంత్ కుమార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సిద్ధరామయ్య వారసుడిగా డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ హైకమాండ్ ఏకగ్రీవంగా డీకేకే మద్దతు ప్రకటించినట్టు తెలిసింది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించొచ్చని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం పదవి చెరో రెండున్నరేండ్లు పంచుకునేలా సిద్ధూ, డీకే మధ్య ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో తమ నేతను సీఎంని చేయాలని డీకే వర్గీయులు పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అహింద వర్గంలో సిద్ధరామయ్యకు ఉన్న ప్రాబల్యం దృష్ట్యా ఆయనను తప్పించేందుకు పార్టీ అధిష్ఠానం సంకోచిస్తూ వచ్చింది. పొరుగున తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చనే కారణంతో యథాతథ స్థితిని కొనసాగించింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడం, డీకే వర్గీయుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సిద్ధరామయ్యను తప్పించేందుకు అధిష్ఠానం నిర్ణయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించడం సిద్ధరామయ్యకు ఇష్టం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఖర్గేను ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. తద్వారా కేసీ వేణుగోపాల్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రస్తుతానికి అలా జరిగే అవకాశాలు చాలా తక్కువని పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు అన్నారు. కాగా, ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నారా అని మీడియా ప్రశ్నించగా చిరునవ్వు చిందిస్తూ ఆయన కారులో వెళ్లిపోయారు. సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా ఇప్పుడు శివకుమార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, కర్ణాటకలో ఉన్న భారీ ప్రభుత్వ వ్యతిరేకతకు 2028 ఎన్నికల్లో ఓటమిపాలై తద్వారా తన నాయకత్వ వాదనలను కూడా కోల్పోవాలని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇలా ఉండగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ట్రోల్ ఆర్మీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే హరిప్రసాద్ ఆరోపించారు. అవినీతి లేదా మరే ఇతర ఆరోపణలు వెలుగులోకి వస్తే తప్ప సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన చెప్పారు. సిద్ధరామయ్యను ఎంపిక చేసినపుడు ఆయనను ఐదేండ్ల కాలానికి ఎంపిక చేశారు. అవినీతికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు లేదా మరేదైనా ఉంటే అప్పుడు మనం ఆలోచించాల్సి ఉంటుంది. బీజేపీ ట్రోల్ ఆర్మీకి స్పందించాల్సిన అవసరం లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనా, 77 ఏండ్ల సిద్ధరామయ్య ఇప్పుడు కొత్తగా రాజ్యసభ స్థానం మారే అవకాశం ఏర్పడింది. జూన్‌లో కర్ణాటక నుంచి ఖర్గే స్థానంతోసహా నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో కనీసం మూడింటిని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. కర్ణాటక నుంచి ఖర్గేను మరోసారి నామినేట్ చేయడంతోపాటు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. మహిళకు లేదా ఓబీసీ అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.