బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి త్వరలోనే తాను తొలగిపోనున్నట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంకేతం ఇచ్చారు. తాను దిగిపోయినా పార్టీ ముందు వరుస నాయకత్వంలో మాత్రం ఉంటానని ఆయన కార్యకర్తలకు హామీనిచ్చారు. బుధవారం జరిగిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘నేను దగ్గర ఉన్నానా లేనా అన్నది ముఖ్యం కాదు.
ఈ పదవిలోనే శాశ్వతంగా ఉండలేను. ఇప్పటికే ఐదున్నరేండ్లు అయిపోయాయి. మార్చి వస్తే ఆరేండ్లు కూడా పూర్తవుతుంది. ఇతరులకు కూడా తప్పకుండా అవకాశం ఇవ్వాలి. మీరేం బాధపడకండి. నేను నాయకత్వ ముందు వరసలోనే ఉంటాను’ అని ఆయన పేర్కొన్నారు.