DK Shivakumar | న్యూఢిల్లీ, జూలై 15: అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేస్తున్న వ్యవహారంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం లేదన్న శివకుమార్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలను కోర్టు తిరస్కరించింది. 2013-18 మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివకుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో డీకే ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.