Karnataka | హైదరాబాద్, డిసెంబర్ 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుర్చీలాట మొదలైనట్టు కనిపిస్తున్నది. కేపీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ముడా, వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు కేసులు బిగుసుకొంటున్న నేపథ్యంలో అధిష్ఠానం కూడా ముఖ్యమంత్రి మార్పునకు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పాలనను, ప్రజాక్షేమాన్ని, గ్యారెంటీల అమలును పక్కనబెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ నాయకులు ఇలా కుస్తీ పడటమేంటని కన్నడ ప్రజలు మండిపడుతున్నారు.
డీకే శివకుమార్‌ను ఇటీవల ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో యాంకర్ ఆయన్ని ప్రశ్నిస్తూ.. ‘కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. మరి జీవితాంతం ఇలాగే డిప్యూటీ సీఎంగానే కొనసాగుతారా?’ అని అడిగారు. దీనిపై డీకే స్పందిస్తూ.. ‘ఎప్పుడూ డిప్యూటీగా నేను ఎందుకు ఉంటా? రాష్ట్రంలో పార్టీ గెలిచిన వెంటనే మా (సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశిస్తూ) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ విషయాలను నేను మీడియా ముందు చెప్పలేను. నా టర్మ్ వచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని బదులిచ్చారు.
డీకే అధికారం పంపకం ఒప్పందం వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు తనకు, డీకే శివకుమార్‌కు మధ్య అధికారం పంచుకోవడంపై ఎలాంటి రకమైన ఒప్పందం జరుగలేదని అన్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకొన్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
సిద్ధరామయ్య, డీకే మధ్య అధికారం పంపకం గురించి ఒప్పందం జరిగిందన్న వ్యాఖ్యలపై హోంమంత్రి జీ పరమేశ్వర కూడా స్పందించారు. మీలో మీరు (సీఎం, డిప్యూటీ సీఎం) ఒప్పందాలు చేసుకొంటూ పోతే.. మేమున్నది ఎందుకంటూ? కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజంగానే సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అలాంటి ఓ ఒప్పందం జరిగినట్లయితే, ఇక మేమంతా ఉన్నది ఎందుకు? ఇక వాళ్లిద్దరినే రాజకీయాలు చేసుకోనివ్వండి. అన్ని పనులనూ వాళ్లనే చక్కబెట్టుకోనివ్వండి. ఇలాంటి డీల్ జరిగినట్టు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కూడా నేనైతే ఎక్కడా వినలేదు. అలాంటి ఒప్పందం సాధ్యం కాదు కూడా. ఏదేమైనా అధిష్ఠానం నిర్ణయాన్ని అందరం గౌరవిస్తాం’ అని పరమేశ్వర తెలిపారు.
ముడా, వాల్మీకి స్కామ్‌లతో చిక్కుల్లో పడిన సిద్ధరామయ్యను సీఎం పోస్టు నుంచి తొలగిస్తే, ఆ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలన్న అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజికవర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం పదవికి డీకేతో పాటు బీసీ నాయకుడైన జార్కిహోళి, దళిత వర్గానికి చెందిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పరమేశ్వర పేర్లను సైతం అధిష్ఠానం పరిశీలిస్తున్నది.