ముంబై: ఒక వ్యాపారి దాచిన బంగారు నగలు మాయమయ్యాయి. తొలుత ఆత్మల పనిగా అతడు అనుమానించాడు. అయితే డబ్బు కూడా చోరీ అయ్యింది. దీంతో చివరకు అతడు పోలీసులను ఆశ్రయించడంతో ఇంటి దొంగల గుట్టు రట్టయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. అబ్దుల్‌కాదర్ షబ్బీర్ ఘోఘవాలా అనే వ్యాపారి ఇంట్లోని బంగారు నగలు ఈ ఏడాది ఫిబ్రవరిలో మాయమయ్యాయి. అనంతరం కొన్ని నెలల వరకు వరుసగా కొన్ని బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. అయితే ఆత్మలు వాటిని తీసుకున్నాయని అతడు భావించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
కాగా, సెప్టెంబర్ నెలలో భారీగా బంగారంతోపాటు డబ్బులు కూడా మాయమయ్యాయి. దీంతో ఇది ఆత్మల పనికాదని, ఎవరో చోరీ చేస్తున్నట్లు అబ్దుల్‌కాదర్ అనుమానించాడు. దీనిపై బైకుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 40 లక్షలకుపైగా విలువ చేసే బంగారం నగలు, డబ్బులు చోరీ అయ్యాయని ఆరోపించాడు. దీంతో ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానించారు. ఒక్క రోజులోనే నిందితురాలైన 12 ఏళ్ల మేనకోడలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
అయితే గుజరాత్‌లోని సూరత్‌లో ఉంటున్న కజిన్ ఈ చోరీకి తనను పురికొల్పినట్లు ఆ బాలిక చెప్పింది. దీంతో ఆ వ్యక్తితోపాటు అతడి ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.40.18 లక్షల విలువైన బంగారు నగలు, డబ్బును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు మైనర్ కావడంతో ఆ మేరకు వ్యవహరిస్తామని, చోరీలో బాలిక పూర్తి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.