న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఓటర్ల జాబితాను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)పై ప్రతిపక్షాలు సమైక్యంగా సోమవారం విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతోపాటు వెలుపల ఉన్న ఆప్‌తోసహా ఇతర ప్రాంతీయ ప్రత్యర్థి పార్టీలు సైతం అసాధారణ రీతిలో ఐక్యతను ప్రదర్శిస్తూ ఈసీ వ్యవహార శైలిపై ధ్వజమెత్తాయి. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సోమవారం సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రతిపక్షాలు ఈసీపై తమ ఆరోపణలను పునరుద్ఘాటించాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన గత ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుని లోక్‌సభను వెంటనే రద్దు చేయాలని టీఎంసీ ఎంపీ మొయిత్రా డిమాండు చేశారు. ఒక పార్టీ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారుల చేతుల్లో ఈసీ ఉందని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారు.
ప్రతిపక్షం చేసిన ఆరోపణలు వేటిపై ఈసీ దర్యాప్తు చేయడం లేదని, మహారాష్ట్రలో అదనంగా చేర్చిన ఓటర్లు, కర్ణాకటలో ఓటర్ల జాబితా అక్రమాలు, పోలింగ్ బూత్‌ల నుంచి వీడియో ఫుటేజీ తొలగింపుపై ఈసీ పెదవి విప్పలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నల నుంచి, తన బాధ్యతల నుంచి ఈసీ పారిపోతోందని ఆయన ఆరోపించారు. 2022లో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 18,000 ఓటర్లపై తాము అనేక అఫిడవిట్లు సమర్పించినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోలేదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ తెలిపారు. ఈసీని బీజేపీ బీ టీమ్‌గా సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ అభివర్ణించారు. ఈసీ పక్షపాతంతో, అన్యాయంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్ ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరించే అవకాశం ఉందా అన్న విలేకరుల ప్రశ్నకు ఇప్పుడే అంత దూరం ఆలోచించవద్దని, పరిరక్షించడానికే రాజ్యాంగం ఉన్నది తప్ప అనైతిక చర్యలకు కవచంగా కాదని ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ షా అన్నారు. బీహార్లోఓటు చౌర్యానికి ముగింపు పలుకుతామని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలు వేటికీ ఈసీ జవాబివ్వలేదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. అదే ఓటరు జాబితాతో లోక్‌సభ ఎన్నికలు జరిగాయని, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయలేదని ఈసీ స్పష్టం చేస్తే వెంటనే కేంద్ర క్యాబినెట్ రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) చేపట్టి మళ్లీ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని సోమవారం కోల్‌కతాలో అభిషేక్ బెనర్జీ డిమాండు చేశారు.
సీఈసీపై విపక్షాల అభిశంసన?
బీహార్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే(ఎస్ఐఆర్), వివిధ రాష్ర్టాలలో జరిగిన ఓటు చౌర్యానికి వ్యతిరేకంగా నిరసనను ఉధృతం చేసిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ప్రతిపక్షాలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసనకు నోటీసు ఇవ్వాలని సోమవారం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీల సభా నాయకుల సమావేశం జరిగింది. సీఈసీపై అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన ఈ సమావేశంలో వ్యక్తం కాగా నాయకులందరూ ఆమోదించినట్లు సమాచారం.