(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో అసెంబ్లీ టిక్కెట్ల పంపిణీ కాక రేపింది. ఆ పార్టీకి అసంతృప్తుల సెగ గట్టిగా తగులుతున్నది. తాజాగా అభ్యర్థుల రెండో జాబితా విడుదల తర్వాత ఇది తారాస్థాయికి చేరింది. టిక్కెట్ లభించని పలువురు ఆశావహులు తమ మద్దతుదారులతో కలిసి భోపాల్‌లోని పీసీసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మరో నేత కమల్‌నాథ్ ఇంటిముందు పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సొంత పార్టీ నేతలే ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి, కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమల్‌నాథ్ తన మద్దతుదారులకే టికెట్లు కేటాయించారని, ఇతర నాయకులకు అన్యాయం చేశారని టిక్కెట్ లభించని ఆశావహులు ఆరోపించారు.స్థానికులకు కాకుండా వలస నేతలకు టికెట్లిచ్చారని, వారిని వెంటనే మార్చాలని నినాదాలు చేశారు. లేకుంటే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తామని హెచ్చరించారు.